కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సూచనలు, సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన అసెంబ్లీకి వస్తే ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలిగించబోమని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా, గోదావరి జలాల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నందున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించేందుకు మంత్రి ఉత్తమ్ ప్రజాభవన్లో పీపీటీ ఇచ్చారు. ఆ తర్వాత సీఎం రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణకు నీటి అన్యాయం జరిగిందో స్పష్టంగా వివరించారు.
రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాష్ట్ర నీటి కేటాయింపులను రెండు రాష్ట్రాలు పంచుకున్నప్పుడు ఏపీకి 511, తెలంగాణకు 299 టీఎంసీలకు కేసీఆర్ , హరీష్ రావు సంతకాలు చేశారని.. తాత్కలికమే అని చెప్పినప్పటికీ పొడిగించుకుంటూ పోయారని..చివరికి తుది నిర్ణయం ప్రకటించేవరకూ అవే అమలు అని చెప్పారన్నారు. ఈ సంతకాలు చేసింది కేసీఆర్ , హరీష్ రావేనన్నారు. అలాగే పాలమూరు రంగారెడ్డి కోసం నీటిని జూరాల నుంచి తీసుకునే చాన్స్ ఉన్నా.. శ్రీశైలం నుంచి తీసుకునేలా ప్లాన్ మార్చి ఘోరమైన అన్యాయం చేశారన్నారు. తల దగ్గర నుంచి తీసుకునే అవకాశం ఉంటే కాదని తోక దగ్గరకు పోవడం వల్ల చాలా నష్టం జరిగిందన్నారు. ఇలాంటి అంశాలన్నింటిపై చర్చించడానికి కేసీఆర్ రావాలని.. ఎలా దిద్దుకోవాలో సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.
ఇలాంటి తప్పులు చేసి ఉంటే ఇతర దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపేవారన్నారు. నాలుగు రోజులకిందట తాను ఇంటర్నల్ గా.. విచారణ చేద్దామని చెబితే హరీష్ ఆ విషయం తెలుసుకుని ఇప్పుడు.. గోదావరి మీదకు పోయాడని.. తాము రాజకీయంగా ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టే నీళ్ల పంచాయతీని తెచ్చారన్నారు. మేం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామని…జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మీ సలహాలు సూచనలు ఇవ్వండి, మేం పొరపాట్లు చేస్తే సరిదిద్దండి.. జానారెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుడిలా లేఖలు మీకు రాశారు.. కనీసం మీరు ఆ పనైనా చేయండని సూచించారు.
