దేశంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంగా దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతానికిపైగా ఏపీకే వచ్చాయి. ఈ విషయాన్ని ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రకటించింది.
రాష్ట్రంలో అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వం చూపుతున్న చొరవ వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఏపీ ఇతర రాష్ట్రాల కంటే ముందుంది.
ఫోర్బ్స్ నివేదిక , తాజా గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ సుమారు రూ. 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను దక్కించుకుంది. సీఐఐ సమ్మిట్‌లో 600 పైగా ఎంఓయూలు కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సుమారు 16 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. కేవలం 48 గంటల వ్యవధిలోనే రూ.150 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించి దేశవ్యాప్తంగా ఏపీ సంచలనం సృష్టించిందని ఫోర్బ్స్ తెలిపింది.
ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన గూగుల్ , రిలయన్స్, అదానీ గ్రూప్ వంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్‌ను తమ ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నాయి. కర్నూలులో డ్రోన్ సిటీ , అమరావతిలో క్వాంటం వ్యాలీ వంటి వినూత్న ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని సాంకేతిక హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ బిజినెస్ విధానం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచిందని ఫోర్బ్స్ తెలిపింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు , కర్ణాటకలతో పోలిస్తే ఏపీ ప్రస్తుతం పెట్టుబడులు సాధించడంలో పైచేయి సాధించింది.