కృష్ణా జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు మరణ శాసనం ‘ రాసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి దక్కిన 811 టీఎంసీలలో తెలంగాణకు 490 టీఎంసీల వాటా అడగాల్సింది పోయి, కేసీఆర్ కేవలం 299 టీఎంసీలకే అంగీకరించి సంతకం పెట్టారని మండిపడ్డారు. ఇదే తప్పుడు నిర్ణయం వల్ల పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చి, అంచనాలను రూ. 32,800 కోట్ల నుంచి ఏకంగా రూ. 90 వేల కోట్లకు పెంచారని, ఇది కేవలం కమీషన్ల కోసమేనని ఆరోపించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పునాదులు 2009లో ఎంపీ విఠల్ రావు రాసిన లేఖతో పడ్డాయని గుర్తు చేసిన సీఎం, 2005-2014 మధ్యే కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టెంపాడు, కల్వకుర్తి వంటి కీలక ప్రాజెక్టులను మంజూరు చేసిందని వివరించారు. అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాల్సింది పోయి, రీ-డిజైనింగ్ పేరుతో కాలయాపన చేసిందని విమర్శించారు. వలసల జిల్లా బిడ్డగా కరువు బాధలు తెలిసిన వాడిని కాబట్టే, ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నానని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు.
40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే ప్రతిపక్ష నేత కేసీఆర్, చర్చకు భయపడి రెండేళ్లుగా సభకు రాకపోవడం చట్టసభలను అవమానించడమేనని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. “బట్టలు ఊడదీస్తాం, తోలు తీస్తాం” అని గతంలో సవాల్ విసిరిన వారు, ఇప్పుడు సభలో వాస్తవాలు బయటపడతాయనే భయంతో పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన ఈ సభలో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా అబద్ధాలకు తావులేకుండా తమ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. చావైనా బతికైనా తెలంగాణ కోసమేనని స్పష్టం చేశారు.
