రేవంత్ రెడ్డి చెప్పాలనుకున్నదాన్ని సూటిగా సుత్తిలేకుండా చెబుతారు. మంచి తెలుగు వాడతారు. అందులో కొన్ని అభ్యంతర పదాలుంటాయి. కానీ అవి కూడా తాను చెప్పాలనుకున్న భావాన్ని స్పష్టంగా ప్రజల్లోకి, ప్రతిపక్ష నేతల్లోకి పంపుతాయి. నీళ్ల నిజాలను అసెంబ్లీలో అంతే పకడ్బందీగా ప్రజెంట్ చేశారు రేవంత్.
బీఆర్ఎస్ ప్రతి ఆరోపణ వెనుక ఆ పార్టీ తప్పిదం
తెలంగాణ అసెంబ్లీలో జల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం కేవలం గణాంకాల వివరణ మాత్రమే కాదు, గత పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను ఎండగడుతూ ప్రతిపక్ష బిఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి గట్టి కౌంటర్ ఇచ్చేలా సాగింది. బిఆర్ఎస్ పార్టీ గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టిందని, ముఖ్యంగా కృష్ణా నది జలాల విషయంలో రాజీ పడిందని చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో తిప్పికొట్టారు. ప్రాజెక్టుల అప్పగింతపై జరిగిన అసత్య ప్రచారాలను సాక్ష్యాధారాలతో సహా సభ ముందు ఉంచి, బిఆర్ఎస్ నేతల ద్వంద్వ ప్రమాణాలను బయటపెట్టారు. ఇది ప్రజల్లో ఉన్న అయోమయాన్ని తొలగించడమే కాకుండా, బిఆర్ఎస్ వాదనలోని డొల్లతనాన్ని ఎత్తిచూపిందన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది.
ప్రాజెక్టుల అవినీతిపై స్పష్టమైన ప్రకటనలు
జల వివాదాల చర్చను రేవంత్ రెడ్డి తెలివిగా కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాల వైపు మళ్లించారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినా, సాంకేతిక లోపాలతో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వెనుక ఉన్న అసలు కారణాలను ఆయన విశ్లేషించారు. ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరుతో జరిగిన అవకతవకలను వివరిస్తూ, నీళ్లు-నిధులు-నియామకాలు అనే తెలంగాణ నినాదం గత ప్రభుత్వంలో ఎలా పక్కదారి పట్టిందో గణాంకాలతో సహా వివరించారు. పాలమూరు ప్రాజెక్ట్ ఇంటేక్ వెల్ పాయింట్ ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడంపైనా ప్రశ్నించారు. అక్కడ మేడిగడ్డ.. ఇక్కడ శ్రీశైలం కేవలం కమిషన్ల కోసమే మార్చారని తేల్చారు.దాని వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కూడా పక్కాగా. బయట పెట్టారు.
కృష్ణా జలాల నిర్వహణపై స్పష్టత
కెఆర్ఎంబీ కి ప్రాజెక్టుల అప్పగింతపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రేవంత్ రెడ్డి బహిర్గతం చేశారు. 299 టీఎంసీలకు ఒప్పుకుని బిఆర్ఎస్ హయాంలోనే సంతకాలు జరిగాయని, ఇప్పుడు ఆ తప్పును కాంగ్రెస్ పైకి నెట్టడం రాజకీయ క్రీడ అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ హక్కుల కోసం తన ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్లడానికైనా సిద్ధమని ప్రకటిస్తూ, రైతాంగంలో భరోసా నింపే ప్రయత్నం చేశారు. బిఆర్ఎస్ చేస్తున్న సెంటిమెంట్ రాజకీయం ఇకపై సాగదని రేవంత్ తన ప్రసంగం ద్వారా సంకేతాలిచ్చారు. అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఈ సుదీర్ఘ చర్చలో, కేసీఆర్ ప్రభుత్వం గతంలో తీసుకున్న విరుద్ధమైన నిర్ణయాలను వరుసగా పేర్చుకుంటూ వెళ్లడం ద్వారా ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలో పడేశారు. ఇది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదు, బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా తన వాదనను బలంగా వినిపించిన తీరుగా కనిపించిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రజల్లో అవగాహన , భవిష్యత్తు కార్యాచరణ
రేవంత్ ప్రసంగం తెలంగాణ భవిష్యత్తు సాగునీటి వ్యూహంపై ఒక స్పష్టతనిచ్చింది. రాజకీయ లబ్ధి కోసం నదుల మీద వివాదాలు సృష్టించడం కాకుండా, చట్టబద్ధంగా రావాల్సిన నీటి వాటాను ఎలా సాధించాలో ఆయన వివరించారు. బిఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలకు తెర దించుతూ, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో ఈ ప్రసంగం ఒక బలలమైన ఆయుధంగా నిలుస్తుందని కాంగ్రెస్ క్యాడర్ సంతృప్తి పడుతోంది.
