ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగి ఉండి కూడా వెనిజులా నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో, పేదరికంలో కూరుకుపోవడానికి పూర్తిగా అక్కడి నియంత పాలకుల వైఖరే కారణం. వెనిజులాలో సుమారు 300 బిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలున్నాయి. . అయితే, ఇక్కడి చమురు హెవీ క్రూడ్. వెలికితీయడానికి, శుద్ధి చేయడానికి భారీ ఖర్చుతో పాటు అధునాతన సాంకేతికత , నిరంతర నిర్వహణ అవసరం. సౌదీ అరేబియా తన చమురు ఆదాయాన్ని తిరిగి మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెడితే, వెనిజులా పాలకులు ఆ పని చేయలేదు. కేవలం చమురు ఎగుమతులపైనే ఆధారపడటంతో వెనిజులా పేదరికంలోనే ఉండిపోయింది.
నియంత పాలకుల తప్పిదాలు
వెనిజులా పతనానికి హ్యూగో చావెజ్ , ఆయన వారసుడు నికోలస్ మదురో అనుసరించిన ఆర్థిక విధానాలే ప్రధాన కారణం. పేరుకే ప్రజాస్వామ్యం అయినా వీరు నిరంతరాయంగా అధికారంలో ఉంటారు. దానికి చేయాల్సిన తప్పుడు పద్దతులన్నీ పాటిస్తారు. వీరి అధికారాన్ని తమ దగ్గరే ఉంచుకోవడానికి తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి చమురు పరిశ్రమలను జాతీయీకరణ చేయడం. దీని వల్ల అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు దేశం విడిచి వెళ్ళిపోయారు. ఆ స్థానాల్లో రాజకీయ విధేయులను నియమించడం వల్ల చమురు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. నిత్యావసర వస్తువులపై ధరల నియంత్రణ విధించడం వల్ల కంపెనీలు నష్టపోయి మూతపడ్డాయి. దీనివల్ల దేశంలో ఆహార కొరత, విపరీతమైన ద్రవ్యోల్బణం ఏర్పడ్డాయి. చమురు ఆదాయం ప్రజలకు చేరాల్సింది పోయి, పాలకుల అవినీతికి, అక్రమాలకు బలవ్వడం వల్ల సంపన్న దేశం కాస్తా యాచక దేశంగా మారింది.
ఆంక్షల వల్ల చమురు అమ్ముకోలేని దుస్థితి
మదురో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి, ప్రతిపక్షాలను అణచివేస్తూ ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నిరసనకారులపై హింస, రాజకీయ ఖైదీల నిర్బంధం వంటి చర్యల వల్ల అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. మదురో ప్రభుత్వం అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలకు సహకరిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అందుకే అమెరికా సహా చాలా దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల వల్ల వెనిజులా తన చమురును అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోలేక ఆర్థికంగా ఒంటరైపోయింది.
చమురు ఆదాయం తగ్గడం – ప్రత్యామ్నాయంగా డ్రగ్స్
వెనిజులాపై అంతర్జాతీయ ఆంక్షలు పెరగడం , చమురు ఉత్పత్తి పడిపోవడంతో, మదురో ప్రభుత్వానికి అధికారిక ఆదాయ వనరులు దాదాపు నిలిచిపోయాయి. ఈ క్రమంలో తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, సైన్యాన్ని తన వైపు ఉంచుకోవడానికి భారీగా నిధులు అవసరమయ్యాయి. దీనికి ప్రత్యామ్నాయంగా వెనిజులా పాలకులు మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఒక వనరుగా ఎంచుకున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా కొలంబియా నుండి అమెరికా యూరప్‌కు వెళ్లే కోకైన్ రవాణాకు వెనిజులా ప్రధాన మార్గంగా మారింది. వెనిజులాలో డ్రగ్స్ వ్యాపారం కేవలం ముఠాలకే పరిమితం కాలేదు, అది ప్రభుత్వంలో భాగమైపోయింది. మదురో ప్రభుత్వం తన పతనాన్ని అడ్డుకునేందుకు సైన్యానికి ఈ డ్రగ్స్ వ్యాపారం ద్వారా వచ్చే లాభాల్లో వాటా ఇస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ డ్రగ్స్ వ్యాపారం వల్ల ప్రధానంగా నష్టపోతోంది అమెరికా యువతే. చమురు సంపదను సద్వినియోగం చేసుకోలేకపోయిన వెనిజులా పాలకులు, అక్రమ మార్గాల్లో అధికారాన్ని కాపాడుకోవడానికి డ్రగ్స్ వ్యాపారాన్ని ఆశ్రయించడం ఆ దేశాన్ని మరింత పతనానికి గురిచేసింది.
పాలకులు మారితే వెనిజులా రాత మారుతుందా?
వెనిజులాకు ఇప్పటికీ కోలుకునే అవకాశం ఉంది. కానీ దానికి రాజకీయ స్థిరత్వం , భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులు అవసరం. మదురోను బంధించిన తర్వాత అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడి, ఆంక్షలు తొలగిపోతే.. తిరిగి చమురు ఉత్పత్తిని పునరుద్ధరించవచ్చు. అయితే, గత దశాబ్ద కాలంలో ధ్వంసమైన మౌలిక సదుపాయాలను బాగు చేయడానికి బిలియన్ల కొద్దీ డాలర్లు, ఏళ్ల తరబడి సమయం పడుతుంది. ప్రకృతి వనరులు మాత్రమే ఒక దేశాన్ని సంపన్నంగా మార్చలేవు, దానికి సమర్థవంతమైన నాయకత్వం, సరైన ఆర్థిక ప్రణాళికలు అవసరమని వెనిజులా ఉదంతం ప్రపంచానికి నేర్పుతోంది.
