తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోకి వచ్చే దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చబోతోంది విభజన చట్టంలోని హామీ మేరకు దుగరాజపట్నంలో ఓడరేవు నిర్మించాలని కూటమి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. జిల్లాల పునర్విభజన తర్వాత ఈ ప్రాంతం తిరుపతి జిల్లాలోకి రావడంతో, ఆధ్యాత్మిక రాజధానికి పారిశ్రామిక కళను అద్దేందుకు ఈ పోర్టు కీలకం కానుంది.
గతంలో పర్యావరణ కారణాలు, ఇస్రో అభ్యంతరాల వల్ల నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును, ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యావరణానికి ముప్పు లేకుండా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దాదాపు 1,500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ పోర్టును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.రాయలసీమ పారిశ్రామిక ప్రగతికి గేట్వే దుగరాజపట్నం పోర్టు కేవలం తిరుపతి జిల్లాకే పరిమితం కాకుండా, మొత్తం రాయలసీమ జిల్లాలకు సముద్ర మార్గంగా నిలవనుంది.
కడపలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్, కర్నూలులోని ఓర్వకల్లు హబ్, మరియు చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ పరిశ్రమలకు ఓడరేవు కీలకం అవుతుంది. రాయలసీమలో లభించే గ్రానైట్, బారైటీస్ వంటి ఖనిజాలను ఎగుమతి చేయడానికి, ఇతర దేశాల నుంచి ముడి సరుకులను దిగుమతి చేసుకోవడానికి ఈ పోర్టు వల్ల రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఇది రాయలసీమలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలకనుంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును దాదాపు విస్మరించగా, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది.
పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, డ్రెడ్జింగ్ పనులపై కూడా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఉపాధి కల్పన , ఆర్థిక వృద్ధి ఈ పోర్టు నిర్మాణం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పోర్టు ఆధారిత పరిశ్రమలు రావడం వల్ల వాకాడు, గూడూరు, నాయుడుపేట పరిసర ప్రాంతాలు పారిశ్రామిక కేంద్రాలుగా మారుతాయి.
