అంతరాష్ట్ర నదీ జలాల వివాదాలు ఎప్పుడూ సున్నితమైనవే. అయితే, వీటిని పరిష్కరించుకోవడానికి సఖ్యత అవసరమైన తరుణంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రాజేశాయి. నా కోరిక మేరకు, నాపై ఉన్న గౌరవంతో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేశారు అని రేవంత్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆయనకే ఇబ్బందికరంగా మారింది. ఇది తెలంగాణలో రాజకీయ మైలేజ్ కోసం చేసిన వ్యాఖ్యగా కనిపిస్తున్నప్పటికీ, వాస్తవాల దగ్గరకు వచ్చేసరికి ఇది ఒక వ్యూహాత్మక తప్పిదంగా మారింది.
ఎన్జీటీ ఆదేశాలతో ఆగిపోయిన రాయలసీమ లిఫ్ట్ పనులు
నిజానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు రేవంత్ రెడ్డి అడగడం వల్ల ఆగిపోయినవి కావు. జగన్ హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును మొదలుపెట్టడంతో, అప్పట్లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ , కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పనులను నిలిపివేశాయి. 2024లో కూటమి ప్రభుత్వం రాకముందే ఈ ప్రాజెక్ట్ న్యాయపరమైన చిక్కుల్లో పడి ఆగిపోయింది. కానీ, రేవంత్ రెడ్డి దీన్ని తన వ్యక్తిగత విజయంగా, తన మాటకు చంద్రబాబు ఇచ్చిన విలువగా చిత్రీకరించడం ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టారు. ఇది ఏపీలోని ప్రతిపక్షాలకు అస్త్రంగా మారి, చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ హక్కులను వదులుకుంటున్నారనే విమర్శలకు తావిచ్చింది.
ఏపీ ‘జల దోపిడీ’ ఎలా సాధ్యం ?
తెలంగాణ రాజకీయాల్లో తరచుగా ఏపీ జల దోపిడీ చేస్తున్నట్లుగా చిత్రించడం ఒక అలవాటుగా మారింది. కానీ దిగువ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, ఎగువ నుంచి వచ్చే మిగులు జలాలను, వరద నీటిని వాడుకోవడం సహజం. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల అంతా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ పరిధిలో జరుగుతుంది. వరద సమయంలో సముద్రంలోకి వృథాగా పోయే నీటిని రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు తరలించుకోవాలనే ఏపీ ప్రయత్నాన్ని దోపిడీ గా అభివర్ణించడం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప, అందులో సాంకేతిక వాస్తవం లేదని కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అనిపిస్తుంది.
బూచి రాజకీయం.. ప్రజల్లో గందరగోళం
తెలంగాణలో గత పదేళ్లుగా బీఆర్ఎస్ అనుసరించిన ఏపీ సెంటిమెంట్ వ్యూహంలో రేవంత్ రెడ్డి స్ట్రాటజిక్ మిస్టేక్ చేశారు. ఏపీని, చంద్రబాబును వివాదంలోకి లాగడం వల్ల రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. రాజకీయాల్లో క్రెడిట్ కోసం ఆరాటపడటం సహజం, కానీ అది అంతరాష్ట్ర సంబంధాలను పణంగా పెట్టి ఉండకూడదు. రేవంత్ రెడ్డి తన రాజకీయ చతురతను నిరూపించుకునే క్రమంలో చేసిన ఈ వ్యాఖ్యల వల్ల, ఏపీలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అనవసరంగా సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే కృష్ణా జలాల అంశంపై మాట్లాడతానని చంద్రబాబు ఆదివారం హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులతో అన్నారు. అంటే.. వివాదం మరో స్టేజ్‌కు వెళ్తున్నట్లే అనుకోవచ్చు.
