తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఐదు రోజుల పాటు సాగాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తన వ్యూహాలతో తనకే నష్టం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఐదు రోజుల పాటు సాగిన ఈ సభలో ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రతిపక్షం, బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించి మైదానాన్ని ఖాళీ చేయడం అధికార పక్షానికి కలిసొచ్చింది. తమ వాదనను ప్రజల ముందు బలంగా పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు బయట ఎన్ని చెప్పుకున్నా.. అసెంబ్లీలో చెప్పేదానికి వచ్చే విలువ అంత రాదు.
యుద్ధమే అని బహిష్కరించిన బీఆర్ఎస్
అసెంబ్లీ సమావేశాలకు ముందు బీఆర్ఎస్ చాలా హైప్ ఇచ్చింది. కేసీఆర్ వస్తారని హడావుడి చేశారు. కృష్ణా జలాలపై యుద్ధం చేస్తామన్నారు. కానీ బీఆర్ఎస్, తీరా సభ మొదలైన రెండో రోజే అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. స్పీకర్ వైఖరి, మైక్ కట్ చేయడం వంటి కారణాలు చెప్పినప్పటికీ, సభలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఆ పార్టీ విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యల కంటే, ప్రతిపక్షం తన రాజకీయ వ్యూహానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కీలకమైన మూసీ ప్రక్షాళన, నీటి ప్రాజెక్టుల చర్చల సమయంలో సభలో లేకపోవడం వల్ల ప్రభుత్వానికి అడ్డంకులు లేకుండా పోయాయి.
కేసీఆర్ ఎంట్రీ.. ఎగ్జిట్ – ఆశలు ఆవిరి
సుదీర్ఘ విరామం తర్వాత సభకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్, కనీసం గంట పాటు కూడా సభలో ఉండకపోవడం బీఆర్ఎస్ శ్రేణులను నిరాశపరిచింది. సభకు వచ్చి సంతకం చేసి, కేవలం 3 నిమిషాల్లోనే తిరిగి వెళ్లిపోవడం ద్వారా కేసీఆర్ అసెంబ్లీని, చర్చలను సీరియస్గా తీసుకోవడం లేదనే సంకేతాలు వెళ్లాయి. ఇది కాంగ్రెస్కు పెద్ద అవకాశంగా మారింది. కేసీఆర్ భయపడి పారిపోయారు అని మంత్రులు చేసిన విమర్శలను తిప్పికొట్టే అవకాశం లేకుండా పోయింది. ఈ తీరుతో పార్టీ కేడర్లో కూడా ఒక రకమైన స్తబ్దత నెలకొంది.
కాంగ్రెస్ వ్యూహాత్మక గెలుపు
మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమావేశాలను పూర్తిస్థాయిలో అనుకూలంగా మార్చుకుంది. ప్రతిపక్షం లేకపోవడంతో సభలో తమ వాదనను ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో గత పదేళ్లలో జరిగిన తప్పులను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, ఆధారాలతో సహా ఏకపక్షంగా వినిపించారు. ప్రతిపక్షం సభలో ఉండి ఉంటే సమాధానం చెప్పాల్సి వచ్చేదని, కానీ వారు పారిపోయారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ ఐదు రోజుల సమావేశాలు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మైలేజీని ఇచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాత్మక వైఫల్యాల వల్ల ఒక గొప్ప వేదికను కోల్పోయింది. రాబోయే పరిషత్, మున్సిపల్ ముందు అసెంబ్లీలో గట్టిగా వినిపించాల్సిన ప్రతిపక్ష గొంతు మూగబోవడం బీఆర్ఎస్కు పెద్ద మైనస్ అనుకోవచ్చు.


