ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ 99tv పేరుతో కొత్త టీవీ చానల్ ఆఫీసును ప్రారంభించారు. ఈ ఆఫీసును కేటీఆర్ ప్రారంభించి.. ఓపెనింగ్ ఇంటర్యూ కూడా ఇచ్చారు. ఇదేమీ వింత కాకపోయినా .. ఆంధ్ర మీడియా అని నిందలేసే ఆయనే స్వయంగాఈ చానల్ ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది.
తోట చంద్రశేఖర్ మాజీ సివిల్ సర్వీస్ అధికారి.కానీ బాగా సంపాదించేసి హైదరాబాద్ లో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ప్రారంభించి పదవికి రాజీనామా చేశారు. ఆయన కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులపై ఎన్ని ఆరోపణలు ఉన్నాయో లెక్కేలేదు. ఎవరికీ సరిగ్గా ఫ్లాట్లు ఇవ్వరు. చాలా కేసులు ఉన్నాయి. ఫిర్యాదులు ఉన్నాయి. పనులు చేసిన వారికి చెల్లింపులు చేయరన్న విమర్శలూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన తన చానల్ కార్యాలయం పెట్టిన భవనం కూడా హాఫీజ్ పేటలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో ఉన్న క్లబ్ హౌస్లోనిదే. ఆ అపార్టుమెంట్ ను ఏళ్ల తరబడి కడుతూనే ఉన్నారు.
తన అక్రమాలకు రాజకీయ అండ కావాలని అనుకున్నారేమో కానీ మొదట పీఆర్పీలో చేరారు..తర్వాత వైసీపీలో చేరారు..మళ్లీ జనసేనలో చేరారు.. చివరికి బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా భూ అక్రమాలకు సహకరించిందని ఆ డబ్బుతో ఏపీలో రాజకీయాలు చేయాలని ప్రోత్సాహించారన్న ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఆయన ఏపీలో కనిపించడం మానేశారు. ఇప్పుడు మళ్లీ టీవీ చానల్ తో ఏపీలో బీఆర్ఎస్ ను ప్రమోట్ చేస్తారేమో చూడాలి.


