సమంత నుంచి తెలుగులో ఓ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. తన ఇమేజ్‌కి తగిన కథలు రాక… కాస్త గ్యాప్ తీసుకొన్న సమంత ఎట్టకేలకు ‘మా ఇంటి బంగారం’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు కథ అందించడం విశేషం. ఈరోజు టీజర్ బయటకు వచ్చింది. టైటిల్ కీ, టీజర్‌కీ అస్సలు సంబంధమే లేదు. ఇందులో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏమిటంటే… సమంత యాక్షన్ మోడ్‌లో దిగిపోవడం. సమంత చేసిన విన్యాసాలు, ఫైట్స్ నిజంగా అబ్బురపరుస్తాయి. ఓ ఇంటికి కొత్త కోడలుగా వెళ్లిన అమ్మాయి, అక్కడి అలవాట్లు, కట్టుబాట్లకు మెల్లమెల్లగా ఎడ్జిస్ట్ అవుతున్న ఓ కోడలి పిల్ల.. సడన్ గా… యాక్షన్ మోడ్ లోకి మారిపోవడం నిజంగా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. సమంత ఎందుకు కత్తి పట్టాల్సివచ్చింది? ఎందుకు గన్ వాడాల్సివచ్చింది? అసలు తన ఇంటెన్షన్ ఏమిటి? ఇంట్లో పిల్లిలా ఉన్న కోడలు… పులిలా మారాల్సిన సందర్బం ఎందుకొచ్చింది? అనే విషయాలన్నీ ప్రస్తుతానికి సస్పెన్స్.
సమంత పెర్ఫార్మెన్స్, ఆ యాంబియన్స్, పరస్పరం విరుద్ధమైన రెండు అంశాల్ని ఒకే చోట ముడిపెట్టడం లాంటి అంశాలు ఆసక్తిని రేకెత్తించాయి. ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ చూసి, ఇది సంసారపక్షమైన సినిమా అనుకొంటే.. ఇందులోని యాక్షన్ చూసి, అంతా అవాక్కవ్వడం ఖాయం. ఓ స్టార్ హీరోయిన్ యాక్షన్‌కి పెద్ద పీట వేసిన కథ ఎంచుకోవడం ఎప్పటికీ ఆసక్తికరమే. నేపథ్య సంగీతం కూడా కాస్త వైవిధ్యంగా కుదిరింది. టీజర్ చూస్తే.. సినిమా ఎప్పుడొస్తుందో అనే కుతూహలం కలగాలి. అదైతే…. ఈ టీజర్ అందించింది.
