అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్ను ఇప్పుడు ఇరాన్ పై పడింది. ఇరాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం , ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను అనువుగా చేసుకుని పంజా వివరాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ మునుపెన్నడూ లేనంతగా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తోంది. వారికి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
గత రెండు వారాలుగా ఇరాన్‌లోని టెహ్రాన్, మషాద్ వంటి ప్రధాన నగరాల్లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ప్రస్తుత పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, కరెన్సీ విలువ పడిపోవడంతో సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారులపై ఇరాన్ భద్రతా దళాలు బలప్రయోగానికి దిగుతుండటంతో, ట్రంప్ స్పందిస్తూ శాంతియుత నిరసనకారులను చంపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు.
ట్రంప్ తన హెచ్చరికలలో భాగంగా, ఇరాన్ ప్రభుత్వం ప్రజలపై కాల్పులకు దిగితే, తాము కూడా వెనక్కి తగ్గబోమని పరోక్షంగా సైనిక చర్య సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే అమెరికా రక్షణ శాఖ ఇరాన్‌పై వైమానిక దాడులకు సంబంధించిన వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈసారి ఇరాన్ నేలపైకి తమ సైనికులను పంపబోమని, కేవలం వ్యూహాత్మక దాడులు మాత్రమే ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఇరాన్ ప్రజలు తమ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారా లేదా బయట శక్తుల ప్రేరేపితమా అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. కానీ ఇరాన్ పై అమెరికా దాడులకు దిగితే మాత్రం.. మరో యుద్ధం ప్రారంభం కాక తప్పదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
