మంత్రి కోమటిరెడ్డి, మహిళా ఐఏఎస్ మధ్య అక్రమ సంబంధం అంటూ వ్యక్తిత్వాలను కించ పరిచేలా వార్తా కథనాలు ప్రసారం చేసిన ఎన్టీవీపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఆ చానల్ కు చెందిన ఇన్ పుట్ ఎడిటర్ తో పాటు మరో ఇద్దరు రిపోర్టర్లను అరెస్టు చేశారు. దొంతు రమేష్, చారి, సుధీర్ అనే జర్నలిస్టులను ఉదయం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో దొంతు రమేష్ బ్యాంకాక్ వెళ్లిపోతూండగా ఎయిర్ పోర్టులో పట్టుబడ్డారు.
చానల్ యజమాని నరేంద్ర చౌదరి, సీఈవో రాజశేఖర్ ఆజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. వారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడమో.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు అత్యంత సన్నిహితులైన వారితో రాజీ కి ప్రయత్నాలు చేయడమో చేస్తున్నారు. అయితే కొంత కాలంగా ఎన్టీవీ చానల్ ఉద్దేశపూర్వంగా ప్రభుత్వంపై బురద చల్లుతూ .. తప్పుడు కథనాలు, గాసిప్స్ ను కావాలని ప్రజల్లోకి పంపుతోందని.. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. అందుకే సిట్ విచారణకు ఆదేశించింది.
తమ జర్నలిస్టులు ముగ్గుర్ని అరెస్టు చేసినా ఎన్టీవీ కనీసం చెప్పుకోలేకపోతోంది. కనీసం స్క్రోలింగ్ కూడా వేయలేదు. మామూలుగా అయితే తమ జర్నలిస్టుల్ని అరెస్టు చేస్తే.. అదీ కూడా వార్తా కథనాన్ని ప్రసారం చేసినందుకు అరెస్టు చేస్తే డిఫెండ్ చేసుకుంటుంది. మీడియాపై దాడి అని ప్రభుత్వంపై ధైర్యంగా పోరాడాలి. కానీ ఎన్టీవీ యాజమాన్యం అదేమీ చేయలేకపోతోంది.