తెలంగాణలో ఒక మంత్రి , మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిగత జీవితంపై అభ్యంతరకర కథనాలు ప్రసారం చేశారన్న ఆరోపణలతో ముగ్గురు జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి అరెస్టులు చేయడానికి వారేమైనా ఉగ్రవాదులా అని ప్రశ్నిస్తూ, ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను అణిచివేస్తోందని, మొహబ్బత్ కా దుకాణ్ అంటే ఇదేనా అని రాహుల్ గాంధీని కేటీఆర్ నిలదీశారు.
అయితే, బీఆర్ఎస్ ఇప్పుడు చేస్తున్న విమర్శలపై నెటిజన్లు గత సంఘటనలను గుర్తు చేస్తున్నారు. 2025 జూన్ లో తమ పార్టీ నేతలపై తప్పుడు కథనాలు ఇస్తున్నారన్న ఆగ్రహంతో బీఆర్ఎస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్‌లోని మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై భౌతిక దాడికి దిగి, అద్దాలు, వాహనాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆ దాడిని సమర్థించుకోవడమే కాకుండా, తమపై బురద జల్లితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అప్పుడు దాడి ని సమర్థించి, ఇప్పుడు చట్టబద్ధమైన అరెస్టు ను మీడియాపై దాడిగా అభివర్ణించడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ రెండు ఘటనల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని నెటిజన్లు ఎత్తి చూపిస్తున్నారు. మహా న్యూస్ విషయంలో జరిగింది కార్యకర్తల భౌతిక దాడి కాగా, ప్రస్తుత ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన అరెస్టు చేశారు. ఒక మహిళా అధికారిపై అసభ్యకర ప్రచారం చేసినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. కానీ ఓ చానల్ పై దాడి చేసిన కొట్టిన వారే ఇప్పుడు అరెస్టులను ప్రశ్నించడం మాత్రం ఎబ్బెట్టుగా ఉంటుంది. పాలసీ ఒకటే ఉండాలి.. మనిషికొకరకంగా ఉంటే అది పాలసీ కాదు.
