ఉద్యోగుల్ని అరెస్టు చేసినా పట్టించుకోలేదని .. రాజకీయ కుట్రల్లో తమ ఉద్యోగుల్ని బలి చేయడానికి కూడా వెనుకాడలేదని విమర్శలు ఎదుర్కొంటున్న టీవీ చానల్ ఇప్పుడు తమ ఇమేజ్ను కాపాడుకునేందుకు కండక్ట్ సర్టిఫికెట్లతో ప్రయత్నిస్తోంది. తమ చానల్ గురించి ప్రజలేమనుకుంటున్నారో కానీ తమ ఉద్యోగులు మాత్రం అలా అనుకోకూడదని.. అలా అనుకుంటున్నారని బయటకు తెలియకూడదని ఓ ప్లాన్ వేశారు. ఉద్యోగులందరికీ యాజమాన్యం చాలా బాగా చూసుకుంటుందని.. జర్నలిస్టులకు స్వేచ్ఛ ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని హుకుం జారీ చేశారు.
యాజమాన్యం నుంచి సూచనలు వస్తే దాన్ని పాటించకపోవడానికి కారణాలేమీ ఉండవు. అందరూ తమ తమ క్రియేటివ్ రేంజ్ లో తమ విధేయత చూపించడానికి.. సదరు యాజమాన్యం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ పోస్టులు వాడుకుంటున్నారు. నెలాఖరుకు జీతం ఇస్తారు… కోవిడ్ సమయంలో ఉద్యోగాలు తీసేయలేదు.. ఏళ్ల తరబడి పని చేస్తున్నాం.. అందుకే మా యాజమాన్యం గొప్ప అని పోస్టులు పెడుతున్నారు. ఇవి యజమాని చేయాల్సిన బేసిక్ పనులు. అందులో గొప్ప ఏముందన్న డౌట్ వారికి రావడం లేదు. పోస్టులు పెట్టాలి కాబట్టి పెడుతున్నారు.
యాజమాన్యపరంగా, ఉద్యోగుల పరంగా ఆ చానల్ కు ఎప్పుడూ రిమార్కులు లేవు. కానీ ఇప్పుడు మా యాజమాన్యం మంచిది అని పోస్టులు పెట్టించుకోవాల్సిన పరిస్థితి రావడమే ఆ చానల్ యాజమాన్యానికి వచ్చిన ఓటమి. ఉద్యోగుల్ని ఎంత బాగా చూసుకున్నా… అది అక్కడ పని చేసే వారు ఫీల్ అయితే చాలు. కంపెనీ అన్నాక చేరేవారు.. మానేసే వాళ్లు ఉంటారు. అసలు ఆలోచించాల్సింది జర్నలిజం ప్రమాణాల గురించే. అక్కడి న్యూస్ వాల్యూస్ ఎలా ఉంటాయో.. పోస్టులు పెట్టించుకుంటే ప్రయోజనం ఉండదు. న్యూస్ కు విలువ కట్టకుండా జర్నలిజానికి విలువలు పెంచితేనే ఇలాంటి పరిస్థితులు మళ్లీ మళ్లీ రాకుండా ఉంటాయి.
