ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ చేసి పారిశ్రామికవేత్తల గుట్టు తెలుసుకుని వారిని బెదిరించి రూ. కోట్ల కొద్దీ ఎలక్టోరల్ బాండ్లను విరాళాలుగా తీసుకున్నారని సిట్ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపైనే ప్రధానంగా కేటీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుడిగా ఉన్న సంధ్యా కన్వెన్షన్ అధినేత శ్రీధర్ రావు, తాను గత ప్రభుత్వ ఒత్తిడి మేరకు రూ. 13 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేశానని వెల్లడించారు. ఫార్ములా-ఈ రేసు విషయంలోనూ నిర్వాహక సంస్థ నుంచి బీఆర్ఎస్కు రూ. 45 కోట్లు బాండ్ల రూపంలో అందినట్లు క్విడ్ ప్రో కో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై కొనసాగుతున్న విచారణలోనూ ప్రధాన కాంట్రాక్టర్ల నుంచి భారీ ఎత్తున ఎలక్టోరల్ బాండ్లు అందినట్లు ఆధారాలు ఉన్నాయి.
కేవలం రాజకీయ విరాళాలుగానే కాకుండా, ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు సంస్థలు ఈ బాండ్లను ఒక సాధనంగా వాడుకున్నాయనే కోణంలో ఇప్పుడు విచారణాధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు, నిధుల విడుదల సమయంలోనే ఈ బాండ్ల కొనుగోలు జరగడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. సిట్ అధికారులు విరాళాల మూలాలు ఎక్కడివి? అవి ఎవరి సూచనల మేరకు బదిలీ అయ్యాయి? అనే అంశాలపై దృష్టి పెట్టి కూపీ లాగుతున్నట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ విచారణ ఒక్క రోజుతో ముగిసేది కాదని భావిస్తున్నారు.