రాజకీయాల్లో ఏ పార్టీ అయినా తమ ఓటమికి దారితీసిన తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగాలని చూస్తుంది. కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాల్లో ఒకటైన భూముల రీసర్వే ‘ అంశాన్ని మళ్లీ భుజాన వేసుకోవడం చూస్తుంటే, ఆ పార్టీ ఆత్మరక్షణలో ఉందో లేక అసలు వ్యూహమే లేని అయోమయంలో ఉందో ఆ పార్టీ క్యాడర్ కే అర్థం కాదు. ప్రజలు ఏ అంశాలనైతే అసహ్యించుకుని పక్కన పెట్టారో, వాటికే క్రెడిట్ మాదే అని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడం విస్మయానికి గురిచేస్తోంది.
భయపెట్టిన బొమ్మల రాజకీయం
గత ప్రభుత్వ హయాంలో భూముల రీసర్వే పేరుతో జరిగిన హంగామా సామాన్య జనాన్ని తీవ్రంగా భయపెట్టింది. పట్టాదారు పాసు పుస్తకాలపై ముఖ్యమంత్రి బొమ్మ వేయడం, పొలాల గట్లపై జగన్ పేరుతో సర్వే రాళ్లు పాతడం వంటి చర్యలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాయి. వీటన్నింటికీ మించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తమ ఆస్తులకు భద్రత లేదన్న ఆందోళనను ఓటర్లలో కలిగించింది. ఈ భయమే ఎన్నికల్లో సైలెంట్ విప్లవంగా మారి వైసీపీని చిత్తుగా ఓడించింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆ ఆంక్షలను, చట్టాలను రద్దు చేస్తుంటే, ఆ రీసర్వే ఆలోచన మాదే అని చెప్పుకోవడం ద్వారా తమ పాత తప్పులను ప్రజలకు మళ్లీ గుర్తు చేస్తున్నట్లు అవుతోంది.
సైలెంట్‌గా ఉండాల్సింది పోయి.. సెల్ఫ్ డబ్బా!
సాధారణంగా ఏదైనా పథకం విఫలమైనప్పుడు లేదా ప్రజాగ్రహానికి గురైనప్పుడు దాని గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండటం రాజకీయ వ్యూహం. కానీ, వైసీపీ శ్రేణులు మాత్రం రీసర్వే క్రెడిట్ మాదే అంటూ సోషల్ మీడియాలో, ప్రసంగాల్లో రెచ్చిపోతున్నారు. రీసర్వే అనేది ప్రభుత్వ పరంగా జరిగే నిరంతర ప్రక్రియ. అయితే, వైసీపీ హయాంలో జరిగిన నిర్వాకాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు మళ్ళీ అదే విషయాన్ని గుర్తు చేయడం ద్వారా, కూటమి ప్రభుత్వానికి వైసీపీ నేతలే మేలు చేస్తున్నారని, ప్రజల్లో వ్యతిరేకతను మళ్ళీ తమ వైపు తిప్పుకుంటున్నారని క్యాడర్ వాపోతోంది.
ఇది వ్యూహమా? లేక రాజకీయ అజ్ఞానమా?
ప్రజలు అసహ్యించుకున్న విధానాలను తమ గొప్పతనంగా చెప్పుకోవడాన్ని వ్యూహం అని ఎలా అంటారని సొంత పార్టీ కార్యకర్తలే తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కేవలం సర్వే చేస్తోంది తప్ప, గతంలో లాగా ఫోటోలు, పేర్లతో ఆస్తులను అపవిత్రం చేయడం లేదు. ఈ తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి తరుణంలో క్రెడిట్ ‘ కోసం పాకులాడటం వల్ల వైసీపీకి వచ్చే రాజకీయ మైలేజీ శూన్యం. ఇది రాజకీయం అనిపించుకోదు సరి కదా.. ప్రజల నాడి పట్టుకోవడంలో ఆ పార్టీ ఎంతగా విఫలమైందో మరోసారి నిరూపిస్తోంది.
