ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా 2027 గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరిగే ఈ మహాత్కార్యానికి దాదాపు 10 కోట్ల మంది భక్తులు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ వేడుకను ఉత్తర భారతంలోని కుంభమేళా తరహాలో నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మౌలిక సదుపాయాల పనులు ప్రారంభం
భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా, గతం కంటే మెరుగైన రీతిలో అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పుష్కరాల కోసం గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆరు జిల్లాలు పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడల్లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 373 ఘాట్లను సిద్ధం చేస్తుండగా, అందులో 139 కొత్త ఘాట్లను నిర్మించనున్నారు. రాజమండ్రిలో నిర్మించనున్న మోడల్ ఘాట్ ఈ పుష్కరాలకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
టూరిజానికి బూస్ట్ ఇచ్చేలా ఏర్పాట్లు
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన కేంద్రాల్లో భారీ టెంట్ సిటీలు, స్థానికుల భాగస్వామ్యంతో హోంస్టే వసతులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కేవలం ఆధ్యాత్మిక వేడుకగానే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే పర్యాటక ఉత్సవంగా మలచాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈసారి పుష్కరాల నిర్వహణలో సాంకేతికతకు పెద్దపీట వేయనున్నారు. ముఖ్యంగా భారీ జనసమూహాన్ని నియంత్రించడానికి ఎటువంటి తొక్కిసలాటలు, ప్రమాదాలు జరగకుండా చూడటానికి ఏఐ డ్రివెన్ క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. అత్యాధునిక ఏఐ కెమెరాల ద్వారా భక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రద్దీ పెరిగినప్పుడు తక్షణమే క్రమబద్ధీకరించేలా రియల్ టైమ్ గవర్నెన్స్ సేవలను వినియోగించనున్నారు.
పుష్కరాల్లోగా పోలవరం పనులు పూర్తి
పుష్కరాల నాటికే ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేసి, గోదావరి జలకళతో భక్తులకు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు భాషా సమస్య తలెత్తకుండా యాప్ ద్వారా బహుభాషా సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు , నిరంతర మొబైల్ కనెక్టివిటీ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా ఈ పుష్కరాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.