ఒకప్పుడు రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర విభజన జరగడం ఖాయం, అనివార్యమని తెలిసి ఉన్నప్పటికీ, ఏపిలో రాజకీయ పార్టీలు ప్రజలలో సమైక్య సెంటిమెంటు రెచ్చగొట్టి వారు ఉద్యమించిన తరువాత మళ్ళీ వారికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం సాహసం చేయలేక, వారితో కలిసి సమైక్యగీతం ఆలపించి వారిని ఆకట్టుకోవాలని తెగ ప్రయత్నించారు. దాని వలన రాజకీయ పార్టీలకి ఏమీ నష్టం కలుగలేదు కానీ రాష్ట్రం, ప్రజలు చాలా నష్టపోయారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా మన రాజకీయ పార్టీలు మళ్ళీ ఇప్పుడు సరిగ్గా అదేవిధంగా వ్యవహరిస్తున్నాయి.
“ప్రత్యేక హోదా ఇవ్వము” అని మోడీ ప్రభుత్వం చాలా స్పష్టంగానే చెపుతోంది. అది మాట తప్పినందుకు ఏమి చేయాలో తరువాత ఆలోచించవచ్చు కానీ హోదా ఇవ్వమని, దాని కంటే రాష్ట్రానికి ఎక్కువ మేలు చేకూర్చే ప్యాకేజి ఇస్తామని చెపుతున్నప్పుడు కూడా ప్రత్యేక హోదాయే కావాలి వేరేమి వద్దు అని చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది. ఇంతవరకు మొండికేసిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు నాలుగు మెట్లు దిగివచ్చి రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి సిద్దం అయినప్పుడు, కేంద్రం నుంచి ఏమేమి రాబట్టుకోవాలో ఆలోచించి దాని కోసం గట్టిగా పట్టుబడితే రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉంటుంది తప్ప హోదాయే కావాలి అని మొండిపట్టు పట్టడం సరికాదు.
ఒకప్పుడు రాష్ట్రం విడిపోతోందని తెలిసి కూడా రాష్ట్రానికి రావలసినవి రాబట్టుకోకుండా చేజార్చుకొని బాధపడుతున్నట్లే, ఇప్పుడు చేతిలో ఉన్న ఈ సువర్ణావకాశాన్ని కాలదన్నుకొని ప్రత్యేక హోదా పేరుతో రాజకీయాలు చేసుకొంటే మళ్ళీ రాజకీయపార్టీలే గెలుస్తాయి..రాష్ట్రమూ..ప్రజలు ఓడిపోతారు.
ప్రత్యేక హోదాపై ప్రజలలో బలమైన సెంటిమెంటు ఏర్పడిందనేది వాస్తవమే. అందుకు కారణం ప్రతిపక్ష పార్టీలు పనిగట్టుకొని చేస్తున్న ప్రచారమే. కనుక తెదేపా, భాజపాల నేతలు ఇప్పటికైనా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం, రాజకీయాలు చేసుకోవడం మానుకొని, అందరూ కలిసి ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ప్రత్యేక హోదా పేరుతో అవి చేస్తున్న రాజకీయాలని గట్టిగా ఎండగట్టి, కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్నివిధాల మేలు కలిగించే ప్రత్యేక ప్యాకేజి సాధించుకొనే ప్రయత్నం చేయాలి.
ప్రత్యేక హోదాకి వ్యతిరేకంగా మాట్లాడితే, ప్రజలలో వ్యతిరేకత ఎదురవుతుందేమో…తమ రాజకీయ ప్రయోజనాలు దెబ్బ తింటాయేమో…అని భయపడుతున్నంత కాలం ప్రతిపక్షాలు ప్రజలని ఇంకా రెచ్చగొడుతూనే ఉంటాయి. దాని వలన తెదేపా, భాజపాల పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతూనే ఉంటుంది. దాని వలన వాటికి మళ్ళీ కోలుకోలేనంత నష్టం జరిగే ప్రమాదం ఉంది. కనుక ఇప్పటికైనా తెదేపా, భాజపాలు రాబోయే ఈ ప్రమాదాన్ని పసిగట్టి మేల్కొనడం చాలా మంచిది
ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి మార్గదర్శకుడు. కనుక ఆయనే ధైర్యంగా ప్రజల వద్దకి వచ్చి ప్రత్యేక హోదా ఇక రాదు. రాకపోయినా నష్టం లేదు. దానికి బదులుగా, దాని కంటే మిన్నగా రాష్ట్రానికి ఎక్కువ లబ్ది కలిగించేందుకు తాను ఏమేమి సాధించారో, దాని వలన రాష్ట్రానికి, ప్రజలకి ఏవిధంగా మేలు కలుగుతుందో వివరించడం మంచిది. ఆయనకి రాష్ట్ర భాజపా నేతలు కూడా పూర్తి మద్దతు ఇస్తే ఆ రెండు పార్టీలకి, రాష్ట్రానికి, ప్రజలకి అందరికీ మేలు కలుగుతుంది. లేకుంటే ఇంకా ఇదేవిధంగా దాగుడుమూతలు ఆడుతూ కాలక్షేపం చేస్తే మళ్ళీ మరోమారు రాష్ట్రం నష్టపోతుంది. అప్పుడు ఆ రెండు పార్టీలని ప్రజలు కూడా క్షమించరుని గ్రహించి చేతులు కాలక ముందే మేల్కొంటే అందరికీ మంచిది.