బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? మరో ఏడాదిలోపలే ఈ సస్పెన్స్ తేలిపోవచ్చు. ఎందుకంటే 2017 ఏప్రిల్ 28న బాహుబలి ద కన్క్లూజన్ విడుదలవుతుందట. గతంలో కథనాలు వచ్చినట్టు ఏప్రిల్ 18న గాక 28న విడుదలవుతుందని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు హిందీలో ఈ చిత్రం విడుదల చేసిన ధర్మా ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్. హిందీలోనూ బాహుబలి వందకోట్లు వసూలు చేసింది. మొదటి భాగాన్ని విడుదల చేసిన ఈ సంస్థనే ఇప్పుడు రెండవ భాగాన్ని కూడా పంపిణీ చేయనుంది. విడుదల తేదీని కరన్ జోహార్ ట్విట్టర్లో పోస్టు చేశారు.ఈ మధ్య బాహుబలికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న వివరాలు విశేషాలు వదులుతున్నారు కూడా.
కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నపై ఏడాది కిందట బోలెడు వూహలు జోకులు కామెంట్లు.. దాన్ని రాజకీయాలకు కూడా అన్వయించిన వ్యవహారం. ఆయన ప్రత్యేక హౌదా అడిగినందుకేనని కూడా సోషల్ మీడియాలో సెటైర్లు సంచరించాయి. ఎందుకు చంపాడంటే చంపమని నేనే చెప్పాను అని దర్శకుడు రాజమౌళి కూడా విద్యార్థులతో జోక్ చేశారు. కట్టప్ప ఎందుకు చంపివుండొచ్చు? ఎందుకైనా చంపొచ్చు. అన్నిటికన్నా కీలకం అతను రాజవంశానికి బానిస గనక తను ఎవరికి కానుకగా వచ్చాడో వారు చెబితే ఏదైనా చేస్తాడు. ఒక వేళ ప్రేమకోసం బాహుబలి రాజ్యాన్ని వదిలేసి వుంటే అప్పుడు రాజుగా ఉన్న వ్యక్తి మాటే కట్టప్ప వినాల్సి వుంటుంది. లేక బాహుబలి చేసే పని ఏదైనా రాజ్యానికి నష్టం అని తను నమ్మితే తనను మరెవరైనా పక్కదోవ పట్టిస్తే కూడా చంపే అవకాశం వుంటుంది. కథకుడు ఎలా రాస్తే దర్శకుడు ఎలా అనుకుంటే అలా చిత్రించొచ్చు. ఏమైనా బాహుబలిని . కట్టప్ప ఎందుకు చంపాడనేది వెల్లడించకుండా దర్శకుడు రెండో భాగానికి ప్రేక్షకులను రాబట్టాలనుకున్నారు. కాని మొదటి భాగంలో అదే ప్రధానాకర్షణగా మారింది. చూసింది కన్క్లూజన్ వచ్చేది బిగినింగ్ అనే వారు కూడా వున్నారు.