ఆనందీ బెన్ పటేల్ వారసుడు ఎవరనేది గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గుజరాత్ కు సంబంధించిన విషయమే అయినా, అది ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల సొంత రాష్ట్రం. అందుకే దేశ వ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. చివరకు సస్పెన్న్ వీడింది. ప్రస్తుత రవాణా, నీటి సరఫరా, కార్మిక శాఖల మంత్రి విజయ్ రూపానీని కొత్త ముఖ్యమంత్రిగా పార్టీ ఎంపిక చేసింది.
గుజరాత్ లో పెద్దగా ఓటు బ్యాంక్ లేని జైన్ సామాజిక వర్గానికి చెందిన రూపానీకి అవకాశం దక్కుతుందని దాదాపు ఎవరూ భావించలేదు. అక్కడ పటేల్ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. పైగా ఇటీవల రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. కాబట్టి పటేల్ వర్గానికి చెందిన నేత కొత్త సీఎం అవుతారని పలు వార్తా సంస్థలు విశ్లేషించాయి.
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో పటేల్ కంటే, సమస్యలను పరిష్కరించగల సత్తా ఉన్న నాయకుడు బీజేపీకి అవసరం. అటు పటేల్ వర్గీయులు, ఇటు దళితులు ఉద్యమిస్తున్న సమయమిది. పైగా, నరేంద్ర మోడీ, అమిత్ షాల వ్యవహార శైలిని గమనిస్తే కేవలం ఓటు బ్యాంకును మాత్రమే వాళ్లు దృష్టిలో పెట్టుకోవడం లేదు. ఇంకా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కాబట్టే హర్యానాలో తొలిసారిగా జాటేతర నాయకుడికి ముఖ్యమంత్రి పదవి దక్కింది. జార్ఖండ్ లో తొలిసారిగా గిరిజనేతరుడు ముఖ్యమంత్రి అయ్యాడు.
విజయ్ రూపానీ 2014లో పశ్చిమ రాజ్ కోట్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత మంత్రి పదవి పొందారు. తన పని తాను చేసుకు పోవడం, అనుకోని సమస్య వచ్చినప్పుడు ఆందోళన చెందకుడా పరిష్కరించే లక్షణాలు ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్లు. తెలుగు 360 ఇదే అంశాలను ప్రస్తావించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రూపానీకే అవకాశం ఉందని విశ్లేషించింది. చివరకు అదే నిజమైంది. రాజకీయ విశ్లేషణల్లో మూస ధోరణికి భిన్నంగా, తార్కిక కథనాలను అందించడంలో తెలుగు 360 తనకు తానే సాటి అని రుజువైంది.