ముందూ వెనుకా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం, వాటిని గుట్టుగా అమలు చేయాలనుకోవడం, తీరా అవి బయటపడి వివాదాస్పదమయ్యాక మిన్నకుండిపోవడమో లేదా వెనక్కి తీసుకోవడమో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. హైడ్రా కూల్చివేతల నుంచి ఖమ్మం భూముల వ్యవహారం వరకు ఇదే ధోరణి కనిపించింది. తాజాగా, గత కేసీఆర్ ప్రభుత్వం స్వరూపానంద స్వామికి కేటాయించిన అత్యంత ఖరీదైన కోకాపేట భూముల విషయంలోనూ రేవంత్ సర్కార్ చివరకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
కోకాపేట భూములు – కేసీఆర్ ఇచ్చిన దక్షిణ
విశాఖ శారదాపీఠం నిర్వాహకులు స్వరూపానంద స్వామి గురించి తెలిసిన వారు చాలా మందే ఉన్నారు. ఆయన పీఠానికి సంప్రదాయ శారదాపీఠాలతో సంబంధం లేకపోయినప్పటికీ, రాజకీయ పలుకుబడితో ఆయన తన ప్రభావాన్ని చాటుకున్నారు. తొలుత సుబ్బరామిరెడ్డి సౌజన్యంతో, ఆపై తన చతురతతో జగన్, కేసీఆర్ వంటి నేతల వద్ద ప్రాపకం సంపాదించారు. కేసీఆర్ కు ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాలను, హోమాలపై ఉన్న ఆసక్తిని అనుకూలంగా మలచుకుని, రాజశ్యామల యాగాలు నిర్వహించి ప్రతిఫలంగా కోకాపేటలో అత్యంత విలువైన భూములను కేటాయింపజేసుకోగలిగారు.
ఏపీలో ఎదురుదెబ్బ – తెలంగాణలో సెటిల్మెంట్!
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి హయాంలో స్వరూపానంద చలాయించిన పెత్తనం అంతా ఇంతా కాదు. విశాఖలో ఏకంగా ఒక కొండనే రాయించుకోవడమే కాకుండా, తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ భూకేటాయింపులను రద్దు చేసి, కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ఆయన అక్కడ పట్టు కోల్పోయారు. దీంతో కోకాపేటలో కేసీఆర్ ఇచ్చిన భూమినే తన ప్రధాన కేంద్రంగా మార్చుకోవాలని ఆయన భావించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూకేటాయింపులను రద్దు చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది, కానీ ఆలస్యంగా స్పందించడం వల్ల ఇప్పుడు సమస్య సంక్లిష్టంగా మారింది.
హిందూత్వం కార్డుతో రేవంత్ సర్కార్ క్లీన్ బౌల్డ్
కోకాపేటలో ఎకరం భూమి ధర ప్రస్తుతం సుమారు 150 కోట్ల రూపాయలు. అంటే రెండున్నర ఎకరాల విలువ దాదాపు 400 కోట్ల రూపాయలు. ఈ భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందనే సంకేతాలు రాగానే, స్వరూపానంద చాకచక్యంగా ‘హిందూత్వం’ కార్డును ప్రయోగించారు. తొలుత అధికారులు సంప్రదించినప్పుడు కోకాపేట భూమిని వదులుకుని, శంషాబాద్ వద్ద రెండు ఎకరాలు తీసుకునేందుకు ఆయన అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఇతర రాజకీయ పక్షాలతో రచ్చ చేయించి, పీఠానికి ఇచ్చిన భూములను లాక్కుంటున్నారనే ప్రచారం మొదలుపెట్టారు. దీంతో డిఫెన్స్‌లో పడ్డ రేవంత్ ప్రభుత్వం.. పీఠానికి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ప్రకటించింది. ఫలితంగా, ఎకరానికి కేవలం ఒక రూపాయి చొప్పున కేసీఆర్ కేటాయించిన ఆ విలువైన భూమిలోనే ఇప్పుడు ఈ స్వయం ప్రకటిత పీఠాధిపతి తన సామ్రాజ్యాన్ని కొనసాగించబోతున్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లోని అస్థిరత స్వరూపానందకు వరంగా మారింది.
