ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజా ప్రతినిధులు కొందర అక్రమాలకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. చట్టాలను చేసే వాళ్లే చట్టాలను ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడానికి చాలా కారణాలున్నాయి. పవర్ ఫుల్ పొలీటిషన్ అనే భావన కావచ్చు, ఎమ్మెల్యే జోలికి పోతే ఏమవుతుందో అనే భయం కావచ్చు, మరో కారణం కావచ్చు. కోర్టులకు మాత్రం ఇలాంటి అనుమానాలేమీ ఉండవు. చట్టాలను అమలు చేయాలని తీర్పులివ్వడమే వాటి పని. హైదరాబాద్ లోని కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే చేపట్టిన అక్రమ నిర్మాణాల విషయంలో కోర్టు అదే పని చేసింది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని చింతల్ లో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ రెండు భవనాలను అక్రమంగా నిర్మించారు. ఆరేళ్ల క్రితం అనుమతిలేకుండా భవంతులను కట్టేశారు. వీటిలో కాలేజీలు, టెక్నో స్కూల్స్ నిర్వహిస్తున్నారు. ఇవి అక్రమ భవనాలంటూ ఎమ్మెల్యే బంధువు ఒకరు ఏడాదిన్నర క్రితం కోర్టుకు వెళ్లారు.
కేసును కోర్టు విచారణకు చేపట్టింది. సాక్ష్యాధారాలను బట్టి అవి అక్రమ భవనాలేనని తేల్చింది. వాటిని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించింది. కోర్టు తీర్పు రావడంతో అధికారులకు మరో మార్గం లేకపోయింది. శనివారం నాడు గ్రేటర్ హైదరాబాద్ అధికారులు ఆ భవనాలను సీజ్ చేశారు. వాటిలో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు కాబట్టి విద్యాశాఖ అధికారుల సమక్షంలో భవనాలను సీజ్ చేశారు.
డబ్బు, పలుకుబడి ఉందని, పదవి ఉందని హైదరాబాదులో ఎంతో మంది అక్రమ నిర్మాణాలు చేపట్టారు. కొన్నింటిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ చాలా అక్రమ భవనాలు అలాగే ఉన్నాయి. కొన్నింటిపై కోర్టుల్లో విచారణ జరుగుతోంది. కోర్టు దృష్టికి వెళ్లని అక్రమ భవనాల పరిస్థితి ఏమిటని నగర పౌరులు ప్రశ్నిస్తున్నారు. కోర్టు తీర్పు స్ఫూర్తితో అయినా అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించాలని నగర పౌరులు కోరుతున్నారు.