రాష్ట్ర విభజన తరువాత చాలా రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ కి తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గట్టిగా చెప్పేవారు. కానీ ఆ తరువాత దానిపై కేంద్రప్రభుత్వ వైఖరి మారడంతో దాని గురించి మాట్లాడటం మానుకొన్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో మాట్లాడవలసి వచ్చినా అది 14వ ఆర్ధిక సంఘం పరిశీలనలో ఉందని రెడీగా ఉన్న సమాధానం చెప్పి తప్పించుకోవడం మొదలుపెట్టారు. ఈ మద్యన కెవిపి రామచంద్ర రావు రాజ్యసభలో దాని కోసం ప్రైవేట్ బిల్లు పెట్టడంతో వెంకయ్య నాయుడుకి మళ్ళీ దాని గురించి మాట్లాడకతప్పడం లేదు. రాజ్యసభలో దానిపై చర్చ జరుగుతున్నప్పుడు కేంద్రవైఖరికి అనుగుణంగానే చెప్పి తప్పించుకొన్నారు. మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపిలు ప్రత్యేక హోదా అంశంపై కేంద్రప్రభుత్వాన్ని విమర్శించుతుండటంతో, వెంకయ్య నాయుడు వారికి జవాబు చెప్పక తప్పలేదు.
గతంలో కాంగ్రెస్ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని పార్లమెంటులోనే గట్టిగా వ్యతిరేకించారని, ఏపికి హోదా ఇస్తే తమ కర్నాటక రాష్ట్రంలో పరిశ్రమలు అన్నీ ఏపికి తరలిపోతాయని వాదించారని, ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలు హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడం చాలా విచిత్రంగా ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇప్పుడు పార్లమెంటులో గట్టిగా వాదిస్తున్న డా.మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ ఆనాడే దానిని విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు? ఏపికి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి, ఎన్డీయే ప్రభుత్వాన్ని విమర్శించేందుకు నైతిక హక్కు లేదని వాదించారు. ప్రత్యేక హోదా గురించి ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, నీటి ఆయోగ్ ఉపాధ్యక్షుడు కసరత్తు చేస్తున్నారని, అతి త్వరలోనే దానిపై తమ ప్రభుత్వం స్పష్థత ఇస్తుందని చెప్పారు.
రెండేళ్ళయినా ఇంకా ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, దానిని పట్టుకొని అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకొంటూ, దాని గురించి గట్టిగా మాట్లాడుతూ ప్రజలని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. గమ్మతైన విషయం ఏమిటంటే అన్ని పార్టీలు ఈవిషయంలో ఎదుట పార్టీయే మోసం చేస్తోందని, “ప్రజలు గమనిస్తున్నారు జాగ్రత్త..వచ్చే ఎన్నికలలో తప్పకుండా గట్టిగా బుద్ధి చెపుతారు..జాగ్రత్త” అంటూ ఒకదానినొకటి హెచ్చరించుకొంటున్నాయి కూడా. అంటే ప్రజలని మోసం చేస్తే ఏమవుతుందో అన్ని పార్టీలకి కూడా బాగానే గుర్తుందని అర్ధం అవుతోంది. అయినా తామొక్కరమే చాలా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, మిగిలినవారు అందరూ ప్రజలని మోసం చేస్తున్నారనే భ్రమలో కాలక్షేపం చేసేస్తున్నాయి.