“అక్షర రూపంలో హిందువుగా ఉంటూ, ఆచరణలో పరాయి మతాన్ని అనుసరించడం అంటే.. అటు రాజ్యాంగాన్ని, ఇటు ధర్మాన్ని ఒకేసారి వంచించడమే.”
ఇలా రాజ్యాంగాన్ని, ధర్మాన్ని వంచిస్తున్నవారు దేశంలో.. ఊహించనంతగాపెరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన సామాజిక పరిస్థితి నెలకొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవుల సంఖ్య కేవలం 1.34 శాతం. అంటే సుమారు 11.30 లక్షలు మాత్రమే. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. అనేక గ్రామాల్లో అధికారికంగా ఒక్క క్రైస్తవుడు కూడా లేకపోయినా, ఊరి పొలిమేరల్లో మూడు, నాలుగు చర్చిలు కనిపిస్తూ ఉంటాయి. రికార్డుల్లో హిందువులుగా ఉంటూ, ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తూనే, ఆచరణలో క్రైస్తవాన్ని పాటించే క్రిప్టో-క్రిస్టియన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని గణాంకాలు సూచిస్తున్నాయి. కొంతమంది పాస్టర్లు బహిరంగంగానే క్రైస్తవుల జనాభా 40 శాతానికి చేరిందని ప్రకటించడం, ఈ వ్యవస్థీకృత మార్పిళ్ల తీవ్రతను తెలియజేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ఎంపీ రఘురామకృష్ణరాజు రామాలయం నిర్మాణానికి భూమిపూజ చేస్తుంటే, కొంతమంది స్థానికులు అడ్డుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మా ఊళ్లో ఒక్క హిందువు కూడా లేరు, ఇక్కడ గుడి ఎందుకు కడుతున్నారు? అని వారు వాదించడం దేనికి సంకేతం? రికార్డుల ప్రకారం ఆ గ్రామంలో అందరూ హిందువులే . కానీ వారు తమని తాము క్రైస్తవులుగా ప్రకటించుకుంటూ హిందూ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం అంటే, హిందూ ధర్మం తన సొంత గడ్డపైనే పరాయికరణకు గురవుతోందని అర్థమవుతోంది.
ఓటు బ్యాంక్ మాఫియా
దేశవ్యాప్తంగా మత మార్పిళ్లు జరుగుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో ఇవి నేరుగా రాజకీయ అధికారంతో ముడిపడి ఉండటం ఆందోళనకరమైన అంశం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మత మార్పిళ్లకు పరోక్షంగా ప్రభుత్వ ప్రోత్సాహం లభించిందనే విమర్శలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా పాస్టర్లకు గౌరవ వేతనాలు, చర్చిల నిర్మాణానికి ప్రభుత్వ నిధుల కేటాయింపు వంటి చర్యలు ఈ ప్రక్రియను వేగవంతం చేశాయి. ఒక నిర్దిష్ట మత వర్గాన్ని శాశ్వత ఓటు బ్యాంక్ గా మార్చుకోవాలనే లక్ష్యంతో, అధికార యంత్రాంగాన్ని వాడుకుని మత మార్పిళ్లను ఒక మాఫియా తరహాలో ప్రోత్సహించారు. ఈ వ్యవస్థీకృత మార్పిళ్ల వెనుక ఉన్న ఆర్థిక మూలాలపై అనేక స్వచ్ఛంద సంస్థలు, ముఖ్యంగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ వంటివి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశాయి. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తూ, సేవా కార్యక్రమాల పేరుతో భారత్కు వస్తున్న కోట్లాది రూపాయలను మత మార్పిళ్లకు మళ్లిస్తున్నట్లు ఈ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్లోని సుమారు 18 ఎన్జీవోలపై విచారణ చేపట్టింది. హార్వెస్ట్ ఇండియా వంటి సంస్థల ఎఫ్సీఆర్ఏ లైసెన్సులను రద్దు చేయడం లేదా నిలిపివేయడం వంటి చర్యలు ఈ కన్వర్షన్ నెట్వర్క్ తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. రికార్డుల్లో హిందువులుగా ఉంటూ, వాస్తవంలో క్రైస్తవాన్ని పాటించే వారి సంఖ్య ఏపీలో ఆందోళనకరంగా పెరుగుతోంది. దీనివల్ల రెండు రకాల నష్టాలు జరుగుతున్నాయి: ఒకటి, రాజ్యాంగం ప్రకారం అర్హులైన నిజమైన ఎస్సీలకు అందాల్సిన రిజర్వేషన్ ఫలాలను ఈ క్రిప్టో-క్రిస్టియన్లు అడ్డదారిలో పొందుతున్నారు. రెండు, జనాభా లెక్కల్లో క్రైస్తవుల సంఖ్య తక్కువగా చూపిస్తూ, క్షేత్రస్థాయిలో మాత్రం గణనీయమైన మార్పు తీసుకురావడం ద్వారా దేశ జనాభా సమతుల్యతను దెబ్బతీస్తున్నారు. చట్టం ప్రకారం మతం మారిన వ్యక్తి ఎస్సీ రిజర్వేషన్ కోల్పోవాలి. కానీ, ఓటు బ్యాంక్ రాజకీయం కోసం పాలకులు ఈ నిబంధనను కఠినంగా అమలు చేయకపోవడం వల్లే డబుల్ బెనిఫిట్ పొందుతున్నారు.
సేవ ముసుగులో సాగుతున్న మత మార్పిడి వ్యాపారం!/span>
మత మార్పిళ్లు అత్యధికంగా బడుగు, బలహీన వర్గాలు, దళితులు ,గిరిజన ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కావడానికి ప్రధాన కారణం వారి సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం. మత ప్రచారకులు పేదరికాన్ని తమ పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. వారి ప్రాంతాలను హాట్ స్పాట్లు గా ఎంచుకుని వ్యవస్థీకృత నెట్వర్క్లు రంగంలోకి దిగుతున్నాయి. బియ్యం బస్తా, ఉచిత వైద్యం , పిల్లల చదువు పేరుతో చేసే చిన్నపాటి సహాయాన్ని ఆధ్యాత్మిక రక్షణ గా ప్రచారం చేస్తూ, అభాగ్యులను మానసికంగా లొంగదీసుకుంటున్న తీరు ఆందోళనకరం. హిందూ సమాజంలో అక్కడక్కడా ఇంకా మిగిలి ఉన్న కుల వివక్షను ఈ శక్తులు ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటున్నాయి. హిందూ ధర్మంలో మీకు గౌరవం లేదు, ఇక్కడికి వస్తే అందరూ సమానం అంటూ చేసే ప్రసంగాలు అట్టడుగు వర్గాలను తప్పుదారి పట్టిస్తున్నాయి. మత మార్పిడులు ఇప్పుడు ఒక నిశ్శబ్ద వ్యాపారం గా రూపాంతరం చెందాయి. విదేశీ నిధులతో నడిచే స్వచ్ఛంద సంస్థలు సేవ పేరుతో నిధులు సేకరించి, ఆ నిధులను మత ప్రచారానికి , టార్గెట్లను పూర్తి చేయడానికి ఉపయోగిస్తున్నట్లు పలు దర్యాప్తు సంస్థల నివేదికలు చెబుతున్నాయి. గణాంకాల ప్రకారం, ప్రతి మార్పిడి వెనుక ఒక ఆర్థిక ప్రయోజనం ముడిపడి ఉంది. పల్లెల్లో పాస్టర్ల నియామకం, ప్రార్థనా మందిరాల నిర్మాణం వెనుక ఒక భారీ నెట్వర్క్ రాజకీయ అండదండలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత కొన్నేళ్లుగా రాజకీయ బలం కోసం ఒక నిర్దిష్ట వర్గాన్ని పెంచి పోషించడం ఈ వ్యాపారానికి మరింత ఊతమిచ్చింది. ఇక్కడ అతి పెద్ద విషాదం ఉంది. రిజర్వేషన్ల ఫలాలను అనుభవిస్తూ ఉన్నత పదవుల్లో స్థిరపడిన వారు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సింది పోయి స్వప్రయోజనాల కోసం మత మార్పిడి శక్తులకు కొమ్ముకాయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. సివిల్ సర్వీస్ అధికారులుగా, కీలక రాజకీయ పదవుల్లో ఉన్నవారు రికార్డుల్లో హిందువులుగా ఉంటూనే, తెరవెనుక మత మార్పిడి సంస్థలను స్థాపించి ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ను నడపడం అత్యంత విచారకరం. ఇలాంటి వారు తమ అధికారాన్ని, పరపతిని ఉపయోగించి అక్రమ మత మార్పిళ్లకు రక్షణ కవచంగా నిలుస్తూ, విదేశీ నిధుల మళ్లింపులో , క్షేత్రస్థాయిలో ప్రచారకులకు వెన్నుదన్నుగా ఉంటూ ఒక భారీ కన్వర్షన్ మాఫియా ను సృష్టిస్తున్నారు. ఈ ప్రొటెక్షన్ నెట్వర్క్ కారణంగానే దర్యాప్తు సంస్థలు సైతం వీరిపై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నాయి. నిజమైన దళితుల హక్కులను హరిస్తూ, రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుని ఎదిగిన ఈ నకిలీ లబ్ధిదారులు తిరిగి అదే సామాజిక వర్గాన్ని మత మార్పిడి ఊబిలోకి నెట్టడం ఒక చారిత్రక ద్రోహం. ఈ వ్యవస్థీకృత దోపిడీని అరికట్టాలంటే కేవలం చట్టాలు సరిపోవు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి మత మార్పిడి వ్యాపారాన్ని సాగిస్తున్న వారిపై కఠినమైన నిఘా ఉంచి, వారిని పదవుల నుండి తొలగించేలా బలమైన చట్టపరమైన సంస్కరణలు తక్షణమే రావాల్సి ఉంది
తక్షణం మేలుకోవాల్సిన సందర్భం
“ఆకలిని ఆసరాగా చేసుకుని చేసే మత మార్పిడి సేవ కాదు, అది ఒక వ్యవస్థీకృత నేరం. బియ్యం బస్తా నీ కడుపు నింపుతుందేమో కానీ, నీ ఆత్మగౌరవాన్ని మాత్రం మతం మార్పిడి ముసుగులో బలి తీసుకుంటుంది.” ఈ విషయాన్ని గుర్తించే సరికే చాలా మంది పర మత మత్తులో కూరుకుపోతున్నారు. ఆకలి, అనారోగ్యం , సామాజిక అభద్రతను పెట్టుబడిగా మార్చుకుని సాగుతున్న ఈ నిశ్శబ్ద ఆక్రమణ మనిషి అస్తిత్వాన్నే దెబ్బతీస్తోంది. ఈ పరిణామం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక సమతుల్యత దెబ్బతింటోంది. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు వేర్వేరు మతాలను అనుసరించడం, పండుగలు, సంప్రదాయాల విషయంలో విద్వేషాలు తలెత్తడం వంటివి సామాజిక అశాంతికి దారితీస్తున్నాయి. హిందూ ధర్మ మూలాల నుంచి ఈ వర్గాలను వేరు చేయడం వల్ల దేశ అస్తిత్వానికి, సంస్కృతికి తీరని నష్టం వాటిల్లుతోంది. ఒకప్పుడు ధర్మబద్ధంగా ఉన్న పల్లెలు, ఇప్పుడు మతపరమైన ధ్రువీకరణతో ముక్కలవుతున్నాయి. కేవలం చట్టాలు లేదా ఆంక్షల ద్వారా ఈ సమస్యను పరిష్కరించలేం. హిందూ సమాజం తనలోని లోపాలను సరిదిద్దుకుని, అట్టడుగు వర్గాలను అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ల దుర్వినియోగాన్ని అరికట్టాలి. మతం మారిన వ్యక్తికి ఎస్సీ హోదా కొనసాగడం అనేది అసలైన దళితుల హక్కులను హరించడమే. సేవ ముసుగులో సాగే ఈ అక్రమ మార్పిడి వ్యాపారానికి అడ్డుకట్ట వేయకపోతే, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ తన స్వంత సాంస్కృతిక ముద్రను కోల్పోయే ప్రమాదం ఉంది.
ఘర్ వాపసీ ఉద్యమం రావాలి !
మత మార్పిళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం కేవలం చట్టాల పుస్తకాల్లోనే లేదు, అది సమాజపు అంతరాత్మలో రావాల్సిన మార్పుపై ఆధారపడి ఉంది. రాజ్యాంగబద్ధమైన ఫలాలను అడ్డదారిలో పొందుతున్న క్రిప్టో-క్రిస్టియన్ల పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి. మతం మారిన వ్యక్తి ఎస్సీ రిజర్వేషన్లను కొనసాగించడం అనేది నిజమైన దళితుల హక్కులను కాలరాయడమే. అందుకే, కుల ధ్రువీకరణ పత్రాల విషయంలో అత్యంత కఠినమైన డిజిటల్ తనిఖీలు చేపట్టాలి. అక్రమ మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో తక్షణమే ప్రవేశపెట్టి, ప్రలోభాలతో సాగే ప్రతి మార్పిడిని నాన్-బైలబుల్ నేరంగా పరిగణించాలి. మత మార్పిళ్ల మహమ్మారిని అడ్డుకోవాలంటే కేవలం ఆంక్షలు విధిస్తే సరిపోదు, హిందూ సమాజం తనను తాను పునర్నిర్మించుకోవాలి. ఘర్ వాపసీ ఉద్యమానికి పిలుపునివ్వాలి. దారి తప్పి వెళ్ళిన సోదరులను ప్రేమతో తిరిగి తమ మూలాల్లోకి చేర్చుకోవడమే ఘర్ వాపసీ’.. మన ధర్మం మన ఇల్లు, ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఘర్ వాపసీ అనేది కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, గ్రామ గ్రామాన ఒక సామాజిక విప్లవంలా సాగాలి. తాత్కాలిక అవసరాల కోసమో, ప్రలోభాల కోసమో తమ పూర్వీకుల ధర్మాన్ని వీడిన వారిని అక్కున చేర్చుకునే ఆత్మీయతను ప్రదర్శించాలి. దళితులు, గిరిజనులు , వెనుకబడిన వర్గాలకు ఆలయాల్లో పరిపూర్ణ గౌరవం, అర్చకత్వంలో భాగస్వామ్యం , సామాజిక సమానత్వం కల్పించినప్పుడే పరాయి మతాల గడప తొక్కాల్సిన అవసరం వారికి ఉండదు. ధర్మం అందరినీ సమానంగా చూస్తుందనే భరోసాను మాటల్లోనే కాదు, ఆచరణలో చూపడమే అసలైన పరిష్కారం. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి హిందూ పౌరుడి కర్తవ్యం. సేవ పేరుతో సాగుతున్న మోసపూరిత మార్పిళ్ల వెనుక ఉన్న కుట్రలను సామాన్యులకు వివరించి చెప్పాలి. ధర్మ పరిరక్షణ అనేది ఒక నిరంతర ప్రక్రియగా సాగాలి.
