మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితుల్ని నిందితులుగా మార్చేలా ఆరోపణలు చేస్తున్నజగన్ రెడ్డి.. అన్న అనే పేరుకే కళంకం అని మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె వివేకాను ఆయన అల్లుడు సునీత భర్త చంపినట్లుగా చిత్రీకరించేందుకు అవినాష్ రెడ్డి కుట్రపూరితంగా ప్రయత్నిస్తున్నారని … వాస్తవానికి సునీత భర్తకు వివేకా అంటే తండ్రి సమానమని, ఆయనపై అపవాదు వేయడం దారుణమని విమర్శించారు. వివేకా హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆమె ఆరోపించారు.
హత్య జరిగిన సమయంలో సాక్షి మీడియా దీనిని గుండెపోటు గా ప్రచారం చేసిందని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దీనిని టీడీపీ ఖాతాలో వేసి రాజకీయ లబ్ధి పొందారని షర్మిల విమర్శించారు. ఒకప్పుడు సీబీఐ విచారణ కోరిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం సునీత ఎన్నిసార్లు ప్రాధేయపడినా ఎందుకు అంగీకరించలేదని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న సీబీఐ విచారణ కూడా కేవలం కోర్టు ఆదేశాల వల్లే సాధ్యమైందని, అధికార బలం చూసుకుని ఐదేళ్లుగా కేసును తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు.
వివేకా హత్యకు ప్రధాన కారణం కడప ఎంపీ టికెట్ వివాదమేనని షర్మిల స్పష్టం చేశారు. అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడం వివేకానందరెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని, ఈ విషయాన్ని ఆయన స్వయంగా తనతో చెప్పారని ఆమె వెల్లడించారు. వివేకా బతికి ఉంటే తన రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతారని భావించే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. తన వద్ద మీడియా, సోషల్ మీడియా బలం ఉందని అవినాష్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివేకా కుమార్తె సునీత ఒంటరిగా పోరాడుతూ సేకరించిన ప్రాథమిక ఆధారాలను కూడా సీబీఐ ఎందుకు లోతుగా పరిశీలించడం లేదని ఆమె నిలదీశారు. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి అర్హుడు కాదని వివేకా భావించినందుకే ఆయన బలి కావాల్సి వచ్చిందని షర్మిల అన్నారు. ఇటీవల సునీత ప్రెస్మీట్ పెట్టి చాలా విషయాలు వెల్లడించారు. దానికి కౌంటర్ గా అవినాష్ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు. ఈ అంశాలపైనే షర్మిల స్పందించారు.
