తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అవసరమైన గట్టి రాజకీయ పునాది వేయడానికి సంకేతంగా కనిపిస్తోంది. ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. సుమారు రూ. 1,399 కోట్లతో నిర్మించనున్న బీబీనగర్ ఎయిమ్స్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలు ఇందులో కీలకం. సాధారణంగా ఎన్నికలకు చాలా ముందుగానే రంగంలోకి దిగే బిజెపి శైలి ప్రకారం, ఈ అభివృద్ధి పనుల ద్వారా కేంద్రం తెలంగాణకు ఏమి చేసింది? అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం మోదీ టూర్ ప్రధాన ఉద్దేశ్యం.
బీఆర్ఎస్తో పొత్తుపై తేల్చనున్న మోదీ
గత కొంతకాలంగా బిజెపి, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే, మార్చి 2026 మొదటి వారంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదు అని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. కానీ ఈ విషయం ఖరారు చేయడానికి ఆయన హోదా సరిపోదు. ఏప్రిల్‌లో మోదీ నిర్వహించబోయే పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభ ద్వారా ఈ విషయంలో కేడర్‌కు మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ విషయంలో మోదీ స్పందనను బట్టి తదుపరి రాజకీయ వ్యూహం అనుకోవచ్చు.
మున్సిపల్ ఫలితాల స్ఫూర్తితో.. జీహెచ్ఎంసీపై గురి
కాంగ్రెస్‌ను ప్రధాన ప్రత్యర్థిగా చూస్తూనే, బీఆర్ఎస్ను విఫలమైన పార్టీ గా చిత్రించడం ద్వారా రాష్ట్రంలో త్రిముఖ పోటీని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది బిజెపి ఎత్తుగడ ఉండే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి తన బలాన్ని నిరూపించుకుంది. చెప్పుకోదగ్గ స్థానాలను సాధించడమే కాకుండా, ఓటు శాతం పరంగా కూడా పుంజుకుంది. ఇదే ఉత్సాహంతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై బిజెపి ప్రత్యేక దృష్టి సారించింది. మోదీ పర్యటనలో హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన ఎంఎంటీఎస్ జ్-2 పనులు, అమృత్ భారత్ స్టేషన్ల ఆధునీకరణ వంటి అంశాలను హైలైట్ చేయడం ద్వారా పట్టణ ఓటర్లను ఆకట్టుకోవాలని భావిస్తున్నారు.
వికసిత్ తెలంగాణ నినాదం
బిజెపి తన వ్యూహాన్ని కేవలం విమర్శలకే పరిమితం చేయకుండా, వికసిత్ తెలంగాణ సంకల్ప పత్రం పేరుతో ఒక ప్రత్యామ్నాయ ఎజెండాను ప్రజల ముందు ఉంచుతోంది. క్లీన్ గవర్నెన్స్, భూముల మార్కెట్ విలువల క్రమబద్ధీకరణ , మౌలిక సదుపాయాల కల్పనను ప్రధానంగా ప్రచారం చేస్తోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలులో వైఫల్యాలను ఎండగడుతూ, కేంద్ర నిధులతో సాగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే బిజెపి అసలు సిసలైన రాజకీయ వ్యూహం. ఏప్రిల్ నెలలో మోదీ టూర్ రాబోయే అసెంబ్లీ , గ్రేటర్ ఎన్నికలకు బిజెపి చేస్తున్న పవర్ఫుల్ స్టార్ట్ అనుకోవచ్చు.
