తమిళనాడు రాజకీయాల్లో కేవలం గ్లామర్ ఉంటే సరిపోదు, బలమైన క్యాడర్ ,ఆర్థికంగా పటిష్టమైన అభ్యర్థులు ఉండాలని టీవీకే అధినేత విజయ్‌కు ఇప్పుడు అర్థమవుతోంది. డీఎంకే, అన్నాడీఎంకే వంటి దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలను ఎదుర్కోవాలంటే కేవలం అభిమాన గణం సరిపోదని, ఎన్నికల వ్యూహాల్లో పొత్తులు ఎంత కీలకమో ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా డీఎంకే తన కూటమిని పటిష్టం చేసుకున్న వేళ, విజయ్ ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగడం ఆయనకు అతిపెద్ద అగ్నిపరీక్షగా మారింది.
సీనియర్ నేతల ముఖం చాటు.. ఆర్థిక బలంపై నీలినీడలు
ప్రస్తుతానికి విజయ్ పార్టీలోకి ఇతర ప్రధాన పార్టీల నుండి భారీ స్థాయిలో సీనియర్ నేతలు చేరకపోవడం ఒక పెద్ద లోటుగా కనిపిస్తోంది. సాధారణంగా కొత్త పార్టీ పెట్టినప్పుడు ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలు క్యూ కడతారు, కానీ టీవీకే విషయంలో అది జరగడం లేదు. ఆర్థికంగా బలమైన నేతలు, స్థానిక ప్రభావం ఉన్న నాయకులు లేకపోవడం వల్ల 234 నియోజకవర్గాల్లో సమర్థులైన అభ్యర్థులను నిలబెట్టడం విజయ్‌కు సవాలుగా మారింది. అభ్యర్థుల ఎంపికలో జరుగుతున్న జాప్యం, పార్టీ అంతర్గత సర్వేల్లో సరైన పేర్లు రాకపోవడం వంటివి సవాల్‌గా మారాయి.
వెయిట్ అండ్ వాచ్ వ్యూహం
బిజెపితో విజయ్ పొత్తు పెట్టుకుని ఉంటే, జాతీయ పార్టీ అండతో పాటు ఆర్థిక వనరులు, బలమైన అభ్యర్థుల మద్దతు లభించేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, సొంతంగా ఎదగాలనే పట్టుదలతో విజయ్ ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఉన్న ఏకైక మార్గం.. డీఎంకే లేదా అన్నాడీఎంకే కూటముల్లో సీట్ల సర్దుబాటు కుదరక అసంతృప్తితో ఉన్న నేతలను ఆకర్షించడం. అంటే, ప్రధాన పార్టీల రిజెక్టెడ్ అభ్యర్థుల కోసం చివరి నిమిషం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి టీవీకేలో నెలకొంది.
అభ్యర్థులు బలంగా లేకపోతే.. అభిమానం ఓటుగా మారుతుందా?
ప్రతి నియోజకవర్గంలో నేనే అభ్యర్థిని అని గతంలో విజయ్ ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అభ్యర్థి వ్యక్తిత్వం, సామాజిక సమీకరణాలు ఓటరును ప్రభావితం చేస్తాయి. కేవలం విజయ్ ముఖం చూసి ఓట్లు వేసే సానుభూతిపరులు ఉన్నప్పటికీ, బూత్ స్థాయిలో ఓటర్లను మేనేజ్ చేసే సమర్థుడైన అభ్యర్థి లేకపోతే ఆ అభిమానం ఓటుగా మారడం కష్టం. ప్రధాన ప్రత్యర్థులు తమ నియోజకవర్గాల్లో పటిష్టమైన యంత్రాంగంతో దూసుకుపోతుంటే, టీవీకే ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉండటం ఆ పార్టీ కేడర్‌లో కొంత ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడులో పొత్తుల్లేకుండా నెట్టుకురావడం అంటే కత్తి మీద సాము చేయడమే. ఇప్పుడు విజయ్ అదే చేస్తున్నారు.
