నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మళ్లీ మంటలు చెలరేగాయి. రాయపూడి వద్ద నూతనంగా నిర్మిస్తున్న హెచ్ఓడీ టవర్ల సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నిర్మాణ పనుల కోసం నిల్వ ఉంచిన ఖరీదైన పైపులు భారీగా అగ్నికి ఆహుతయ్యాయి. నాలుగు గంటలు శ్రమించి అగ్నిమాపక బృందాలు మంటలు అదుపులోకి తెచ్చారు. పెద్ద ఎత్తున పైపులు కాలిపోయాయి.
అమరావతిలో వరుసగా జరుగుతున్న ఈ అగ్నిప్రమాదాలు ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. సాధారణంగా అగ్నిప్రమాదం జరగడానికి ఆస్కారం లేని ఖాళీ ప్రదేశాల్లో, నిల్వ ఉంచిన పైపులే లక్ష్యంగా మంటలు అంటుకోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో వెలగపూడి సమీపంలో కూడా ఇదే తరహాలో పైపులకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన మరువక ముందే, ఇప్పుడు రాయపూడిలో పునరావృతం అయ్యాయి. రాజధాని పనులను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే అసాంఘిక శక్తులు ఈ దారుణానికి ఒడిగడుతున్నాయని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.
గతంలో జరిగిన ప్రమాదాలపై ముఖ్యమంత్రి స్వయంగా విచారణకు ఆదేశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో నిఘా యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో అమరావతి ప్రాంతంలో చెరుకు తోటలకు నిప్పు పెట్టిన చేదు అనుభవాలు ఉన్నా, కీలకమైన నిర్మాణ సామాగ్రి వద్ద భద్రతను పటిష్టం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగ్నిప్రమాదాలు జరిగిన ప్రతిసారీ దర్యాప్తు పేరుతో కాలయాపన చేయడం వల్లనే అసాంఘిక శక్తులు తెగబడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిఘా కెమెరాలు, పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంలో అధికారులు విఫలమయ్యారనేది స్పష్టమవుతోంది.
అమరావతి రాజధాని పనులు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుని, వరల్డ్ బ్యాంక్ నిధులు మంజూరైన తరుణంలో ఇలాంటి ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఆస్తికి భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, నిర్మాణ గడువుపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. వాళ్ల కుట్ర కూడా అదే.
