మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ సంస్థపై అక్రమ మైనింగ్ ఆరోపణలపై సీఐడీ విచారణకు రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ సాగించి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారన్న ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని ఆయన స్పష్టం చేశారు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ పై ఇటీవలి కాలంలో చాలా ఆరోపణలు వస్తున్నాయి.హైదరాబాద్ శివారుతో పాటు ఖమ్మం జిల్లాలోనూ భారీ ఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలపై విచారించాలని రేవంత్ నిర్ణయించారు.
సొంత కేబినెట్ లోని కీలక మంత్రికి చెందిన కంపెనీపై విచారణకు ఆదేశించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాఘవ కన్ స్ట్రక్షన్స్ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఐడీ విచారణకు ఆదేశించడంతో మంత్రి పొంగులేటి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ విచారణలో అక్రమాలు రుజువైతే, అది కేవలం కంపెనీకే కాకుండా మంత్రి పదవికి కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో సీఐడీ సమర్పించే నివేదిక తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మలుపులు తిప్పుతుంది.
సీఐడీ ప్రభుత్వం చేతుల్లోనే ఉండే విభాగం కాబట్టి, విచారణ ఎంత నిష్పక్షపాతంగా సాగుతుందనే అనుమానాలు కూడా విపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఓ రకంగా ఇది రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం అని భావిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారంపై ఇటీవలి కాలంలో రేవంత్ అసంతృప్తితో ఉన్నారని.. ఆయనను కంట్రోల్ లో ఉంచడానికి ఇలాంటి కేసులు ప్రభుత్వం గుప్పిట్లో ఉండటం మంచిదని అనుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. ఏదైమైనా ఈ కేసుతో రేవంత్ రెండు ప్రయోజనాలు పొందుతారు. ఒకటి సొంత మంత్రిపై విచారణ చేయిస్తున్నారన్న పేరు..రెండు పొంగులేటి ఇక గ్రిప్ దాటిపోకుండా ఉండటం.
