కేసీఆర్ లేకుంటే నాకు ఈ గుర్తింపు వచ్చేది కాదు అని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా ప్రతినిధులతో అన్నారు. కేసీఆర్ ను ఎంతగా విమర్శించినా రేవంత్ మాత్రం తన ఎదుగుదుల విషయంలో కేసీఆర్‌కూ ఎప్పుడూ క్రెడిట్ ఇస్తారు. రేవంత్ రెడ్డి రాజకీయ ఎదుగుదలకు కేసీఆర్ చూపించినవ్యతిరేకతే ప్రధాన ఇంధనంగా పనిచేసింది. గత పదేళ్లుగా కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఎంతగా టార్గెట్ చేశారో, రేవంత్ అంతగా ప్రజల్లోకి వెళ్లగలిగారు.
ముఖ్యంగా ఓటుకు నోటు కేసు మొదలుకొని, ఆయనను జైలుకు పంపడం, అడుగడుగునా అణచివేయాలని చూడటం రేవంత్‌లో ఒక రెబల్ ఇమేజ్ను సృష్టించాయి. కేసీఆర్ లాంటి బలమైన నేతను ఢీకొనే మొనగాడు రేవంత్ మాత్రమేననే భావన ప్రజల్లో కలగడానికి కేసీఆర్ చేసిన దాడులే కారణమయ్యాయి. ఈ విషయాన్ని రేవంత్ చాలా నిజాయితీగా, నిష్కర్షగా అంగీకరిస్తారు. తాను కేసీఆర్ ను ప్రత్యర్థిగా ఎంచుకోలేదని తనను కేసీఆర్ ఎంచుకున్నారని గతంలో కూడా చెప్పారు.
ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం కావడంపై రేవంత్ రెడ్డి వేసిన సెటైర్లు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కేసీఆర్‌ను ఆయన కుటుంబ సభ్యులే (గృహనిర్బంధం చేశారేమోనన్న అనుమానం కలుగుతోందని రేవంత్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా కేసీఆర్‌ను అడ్డుకుంటున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. ఫీల్డ్ లో లేని నాయకుడి గురించి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదని చెబుతూనే, కేసీఆర్ బయటకు రాకపోవడం వెనుక ఏదో అంతర్గత కుట్ర ఉందన్నట్లుగా రేవంత్ అనుమానాలు పెంచేలా రాజకీయం చేస్తున్నారు.
కేసీఆర్ ప్రస్తుతం రాజకీయంగా మౌనంగా ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి మాత్రం ఆయనను వదలడం లేదు. కేసీఆర్ అనే పదం ఏడాది తర్వాత వినిపించదని, ఆయన రాజకీయం ముగిసిందని రేవంత్ అంటున్నప్పటికీ.. నిరంతరం కేసీఆర్ గురించి మాట్లాడుతూనే ఉండటం చూస్తుంటే, రేవంత్ దృష్టి ఇంకా తన పాత ప్రత్యర్థిపైనే ఉందని అర్థమవుతోంది.