రాజకీయాల్లో ప్రత్యర్థులు విమర్శలు చేయడం సహజం, కానీ ఒక నాయకుడిని చూసి జాలి పడాల్సిన పరిస్థితి రావడం మాత్రం ఆ నాయకుడి అల్లాటప్పా రాజకీయాలకే నిదర్శనం. మాజీ ముఖ్యమంత్రి,హోదా లేని ప్రతిపక్ష నేత జగన్ రెడ్డి తాజాగా ప్రవచించిన రాజధాని మావిగన్ రాజధాని కాన్సెప్ట్ చూస్తుంటే, ఆయన రాజకీయాల్లో సీరియస్ నెస్‌ను పూర్తిగా పక్కనపెట్టి, ట్రోలింగ్ మెటీరియల్‌గా మారడానికే మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోంది.
ఐదేళ్లు మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంతో ఆటలాడి, ఇప్పుడు మావిగన్ అంటూ ఒక కొత్త పేరుతో ముందుకు రావడం చూస్తుంటే.. ఆయన అసలు రాజకీయ నాయకుడా లేక కామెడీ స్క్రిప్ట్ రైటరా అనే సందేహం కలగక మానదు. ఈ సిల్లీ పాలిటిక్స్ చూసి విమర్శించాలన్నా విసుగొచ్చేలా ఉంది, అందుకే నెటిజన్లు పాపం జగన్ అని జాలి చూపిస్తున్నారు.
జగన్ రెడ్డి మాటల్లో తర్కం వెతకడం అడివిలో అమృతం కోసం వెతికినట్లే ఉంటుంది. ఒకవైపు అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తుంటే, ఆయన మాత్రం అసెంబ్లీలో దాన్ని సవరించేస్తామంటూ వింత వాదనలు చేస్తున్నారు. రాజ్యాంగం మీద కనీస అవగాహన ఉన్న ఎవరైనా పార్లమెంట్ చట్టాన్ని అసెంబ్లీ ఎలా మారుస్తుందని నవ్వుకుంటారు. కానీ, జగన్ రెడ్డికి మాత్రం తన పంతమే పరమావధి. నిజాయితీ లేని రాజకీయం, పస లేని విమర్శలు, వీటన్నింటికీ మించి మావిగన్ వంటి కుళ్లు జోకుల లాంటి పేర్లు పెట్టడం చూస్తుంటే.. వైసీపీ పతనం ఏ స్థాయికి చేరిందో స్పష్టమవుతోంది. ఆయన మైండ్ సెట్ చూస్తుంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే, ఏదో ఒక వింత ప్రతిపాదన చేసి వార్తల్లో నిలవాలనే తపన తప్ప మరొకటి కనిపించడం లేదు.
మావిగన్ పేరు విన్న తర్వాత పవన్ కళ్యాణ్ మీడియా ముందు నవ్విన ఆ నవ్వు.. వేయి మాటల కంటే ఎక్కువే చెప్పింది. ఆ నవ్వులో వెటకారం ఉంది, జగన్ రాజకీయ అజ్ఞానంపై జాలి ఉంది, అంతకంటే మిన్నగా నీ స్థాయి ఇదా జగన్? అనే ప్రశ్న ఉంది. ఆ నవ్వు వెనుక ఉన్న అర్థాన్ని వైసీపీ శ్రేణులు గ్రహించి ఉంటే, సొంత పార్టీ నాయకుల మీద తమకే అసహ్యం వేసేది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత అంటే ప్రభుత్వ లోపాలను ఎండగట్టాలి కానీ, ఇలాంటి జోక్ లాంటి ప్రతిపాదనలతో తనను తాను తక్కువ చేసుకుని, ప్రజల ముందు నవ్వులపాలు కావడం జగన్ రెడ్డికే చెల్లింది. రాజకీయం అంటే రచ్చ చేయడం కాదు .. కాస్తైనా కనీస పరిజ్ఞానంతో మాట్లాడటం. అది కూడా జగన్ రెడ్డి కరవయింది.


