మావిగన్… అనే ఆయుధాన్ని పార్టీ నేతలకు ఇచ్చి జగన్ రెడ్డి బెంగళూరు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ ఆయుధాన్ని ఎలా వాడుకోవాలో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. వారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా తయారైంది. గత ఎన్నికల ఘోర పరాజయం తర్వాత కూడా నాయకత్వం వాస్తవాలను గ్రహించకపోవడం వారికి ఇబ్బందికరంగానే ఉంది. ప్రజలు ఇప్పటికే తిరస్కరించిన మూడు రాజధానుల రాగాన్ని వదిలేసి, ఇప్పుడు మావిగన్ అనే ప్రతిపాదనను ప్రజలకు ఎలా చెప్పారో వారికి అర్థం కావడం లేదు.
పైకి రావాలనుకోక మునిగిపోవడం ఏమిటి?
అమరావతిని పాడుబడ్డ ప్రాంతంగా మార్చిన చారిత్రక తప్పిదం వైసీపీ చేసిది. ఎన్నికల ప్రచారంలో కనీసం మూడు రాజధానులు అని చెప్పుకోలేకపోయిన జగన్ రెడ్డి ఇప్పుడు అదే తప్పు చేస్తున్నారు. ప్రజలు అభివృద్ధిని, ఉపాధిని కోరుకుంటుంటే, వైసీపీ మాత్రం ఇంకా పాత పగలు, అసంబద్ధ వాదనలకే పరిమితమవ్వడం వల్ల ఆ పార్టీ ప్రాభవం పాతాళంలోకి పడిపోతోంది. కనీసం ఒక గడ్డిపోచ దొరికినా పైకి రావాలని ప్రయత్నించాల్సింది పోయి, ఉన్న అవకాశాలను కూడా తలకమాసిన సలహాలతో పాడు చేసుకుంటున్నారు.
ప్రజానాడిని పట్టుకోవడంలో విఫలం
ప్రస్తుతం ప్రజల నాడిని పట్టుకోవడంలో వైసీపీ నాయకత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక పోరాటం చేయడం కంటే, రాజధాని అమరావతిపై బురద జల్లడమే ఏకైక అజెండాగా పెట్టుకోవడం వల్ల ఆ పార్టీని మేధావి వర్గం కూడా సీరియస్ గా తీసుకోవడం లేదు. పార్లమెంట్లో ఇతర జాతీయ పార్టీల మద్దతు కోల్పోవడం, సొంత కేడర్లోనే నాయకత్వంపై అసహనం పెరగడం వంటివి వైసీపీ అంతిమ దశ కు చేరుకుందనే సంకేతాలను ఇస్తున్నాయి. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి, లేనిపోని వివాదాలను సృష్టించి నవ్వుల పాలు కావడం వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ కంట్రోల్ దాటిపోయింది.
ఊరుకున్నంత ఉత్తమం!
ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వైసీపీకి ఉన్న ఏకైక మార్గం మౌనం . కొన్నాళ్లపాటు అనవసరపు రాజకీయ ప్రకటనలు, వింత ప్రతిపాదనలు పక్కన పెట్టి సైలెంట్‌గా ఉండటం ఆ పార్టీకి మేలు చేస్తుంది. ప్రజల ఆగ్రహం తగ్గే వరకు వేచి చూసి, క్షేత్రస్థాయిలో పార్టీని పునర్నిర్మించుకోకుండా ఇప్పుడే నేను వస్తున్నాను అంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తే ప్రజలు మరింతగా ఛీత్కరించుకుంటారు. ప్రభుత్వం చేసే అభివృద్ధిని అడ్డుకోకుండా, కేవలం ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటూ మళ్లీ నమ్మకాన్ని సంపాదించాలి.
తప్పులు దిద్దుకోవడం ముఖ్యం!
కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాలంటే ముందు పాత తప్పులను మనస్ఫూర్తిగా ఒప్పుకుని, ప్రజల విశ్వాసాన్ని మళ్లీ పొందడంపై దృష్టి పెట్టాలి. లేనిపక్షంలో, ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఒక ముగిసిన అధ్యాయం గా మిగిలిపోతుంది. అబద్ధాల పునాదులపై నిర్మించిన రాజకీయం ఎంతో కాలం నిలవదు, నిజం నిలకడగా తెలుస్తుందనే సామెత ఇప్పుడు వైసీపీ విషయంలో అక్షరాలా నిజం కాబోతోంది. అమరావతి వెలుగుల్లో వైసీపీ నీడ కనుమరుగవ్వకముందే ఆ పార్టీ మేల్కోవాల్సిన అవసరం కనిపిస్తోంది. కానీ ఆ పార్టీ నాయకత్వానికి అర్థం కావడం లేదు.
