తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అందరి కంటే ప్రత్యేకమైన నేత విజయ్ కాదు. సీమాన్. ఆయన ఎవరితోనూ పొత్తులు పెట్టుకోరు.. సీట్ల కోసం రాజకీయాలు చేయరు. తన సిద్ధాంతాలను బలంగా చొచ్చుకెళ్లేలా చేస్తారు. ఫలితంగా ఆయనకు ఓటు బ్యాంక్ పెరుగుతూ వచ్చింది. గత ఎన్నికల్లో పది శాతం ఓట్లు వచ్చాయి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఆయనపై పడింది. సీమాన్ దృష్టిలో తమిళనాడు కేవలం ఒక రాష్ట్రం కాదు, అది ఒక సాంస్కృతిక దేశం. ఈ సబ్-నేషనలిజం భావనను ఆయన తన ప్రసంగాల ద్వారా యువత రక్తంలోకి ఎక్కించారు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా పోటీ చేయడం ఆయన స్టైల్.
తమిళ జాతీయవాదం సీమాన్ సిద్ధాంతం
ద్రావిడ సిద్ధాంతాల నీడలో ఉన్న తమిళ రాజకీయాలకు తమిళ జాతీయవాదాన్ని రుచి చూపిస్తున్నారు సీమాన్. తమిళనాడును తమిళులే ఏలాలి అనే ఆయన నినాదంతో ఆయన ప్రచారం చేస్తూ ఉంటారు. జయలలిత, కరుణానిధి ఫ్యామిలీ తమిళులు కాదన్న ప్రచారం ఉంది. అందుకే డీఎంకే, అన్నాడీఎంకేలను తమిళేతరుల ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థలు గా అభివర్ణిస్తారు. ఈ కఠినమైన వైఖరి ఆయనకు ఒక బలమైన కల్ట్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. గత ఎన్నికల్లో 10 శాతం వరకూ ఓట్లు సాధించిన ఆయన, ఈసారి ఈ సారి మరింత బలమైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
సీమాన్ మేనిఫెస్టో కూడా ప్రత్యేకమే
సీమాన్ మేనిఫెస్టో కూడా విచిత్రంగా ఉంటుంది. పరిపాలన వికేంద్రీకరణ కోసం తమిళనాడులో మూడు లేదా నాలుగు ఫంక్షనల్ రాజధానుల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికలో ఇప్పటికే 50% మహిళలకు అవకాశం కల్పించారు. అధికారం ఇస్తే అన్నింటిలోనూ అమలు చేస్తామని చెబుతున్నారు. వ్యవసాయాన్ని ప్రభుత్వ ఉద్యోగం గా గుర్తించడం, ప్రతి రైతుకు గౌరవప్రదమైన జీతం కల్పించడం వంటి హామీలు గ్రామీణ ప్రాంతాల్లో ఆయనను ఒక విలక్షణ నేతగా నిలబెట్టాయి.
విజయ్ ఫ్యాక్టర్ వర్సెస్ సీమాన్ కరిష్మా
నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడంతో సీమాన్ ఓటు బ్యాంకు దెబ్బతింటుందని ప్రచారం జరుగుతోంది. అయితే, సీమాన్ మాత్రం దీనికి అస్సలు తగ్గడం లేదు. గ్లామర్ తాత్కాలికం,సిద్ధాంత పోరాటం శాశ్వతం అనేది ఆయన వాదన. విజయ్ తన విధానాలను ప్రకటించకముందే, సీమాన్ తన పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లారు. ముఖ్యంగా తమిళ జాతీయవాదం విషయంలో సీమాన్ తీసుకున్న స్టాండ్ అత్యంత తీవ్రమైనది కావడంతో, ఆ భావజాలం ఉన్న యువత విజయ్ వైపు వెళ్లే అవకాశం తక్కువని భావిస్తున్నారు.
