నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీ రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. మున్సిపల్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఈ పరిణామంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే బిజెపి, భారత్ రాష్ట్ర సమితి చేతులు కలపడం. కాంగ్రెస్ పార్టీని నిలువరించడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు కలిసి సాగించిన ఈ రాజకీయ వ్యూహం కొత్త పరిణామాలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.
ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం పన్నెండు మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ నాలుగు, బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాలు గెల్చుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి, ఎమ్మెల్యే ఓటుతో కలిపి కాంగ్రెస్ కు ఐదు స్థానాలయ్యాయి. అనేక వివాదాల తర్వాత చివరికి బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోవాలని నిర్ణయిచుకున్నారు. రెండు పార్టీలు కలిస్తే ఎనిమిది మంది బలం ఉంటుంది. అందుకే ఓ ఒప్పందానికి వచ్చారు.
ఈ ఒప్పందంలో భాగంగా చైర్మన్ పదవి బీజేపీకి, వైస్ ఛైర్మన్ పదవి బీఆర్ఎస్కు దక్కింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ షోయబ్ అహ్మద్ ఖానాపూర్ మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. రాష్ట్ర స్థాయిలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అధికారం కోసం కలిసిపోవడం కేడర్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.