రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇప్పుడు లగ్జరీ కంటే సస్టైనబిలిటీ అతిపెద్ద సెల్లింగ్ పాయింట్‌గా మారింది. సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే సోలార్ ప్యానెళ్లు, వర్షపు నీటిని ఒడిసిపట్టే వ్యవస్థలు, ఏసీ అవసరం లేకుండా సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా రూపొందించే నెట్ జీరో హోమ్స్ కు గిరాకీ విపరీతంగా పెరుగుతోంది. ఇవి కేవలం పర్యావరణానికి మాత్రమే కాదు, కొనుగోలుదారుడి జేబుకు కూడా దీర్ఘకాలంలో భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి.
ఆదా అయ్యే ఖర్చులే అసలు పెట్టుబడి
ఒక గ్రీన్ హోమ్‌లో నివసించడం వల్ల కలిగే ప్రాథమిక లాభం.. నెలవారీ నిర్వహణ ఖర్చులలో భారీ తగ్గింపు. నెట్ జీరో ఇళ్లలో విద్యుత్ బిల్లులు దాదాపు 70 నుండి 90 శాతం వరకు తగ్గుతాయి. అలాగే, వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్లు ఉండటం వల్ల నీటి బిల్లులు కూడా గణనీయంగా తగ్గుతాయి. ఒక సగటు కుటుంబం గ్రీన్ హోమ్‌లో నివసించడం ద్వారా ఏడాదికి కనీసం 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు కేవలం యుటిలిటీ బిల్లుల రూపంలోనే ఆదా చేయవచ్చని అంచనా. ఈ ఆదా మొత్తాన్ని గృహ రుణం ఈఎంఐతో పోల్చి చూస్తే, దీర్ఘకాలంలో ఇంటి అసలు ధరలో ఇది కీలకమైన వెసులుబాటుగా మారుతుంది.
ఆరోగ్యమే మహాభాగ్యం.. గ్రీన్ వెర్షన్!
ఖర్చుల ఆదా పక్కన పెడితే, గ్రీన్ బిల్డింగ్స్ నివాసితుల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి. తక్కువ రసాయనాలు ఉండే పెయింట్లు , మెరుగైన గాలి నాణ్యత , ,సహజ వెలుతురు వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా ఉత్పాదకత పెరుగుతుంది. ఆధునిక కొనుగోలుదారులు ఇప్పుడు ఆసుపత్రి ఖర్చులను కూడా ఒక ఇన్వెస్ట్మెంట్గా పరిగణిస్తున్నారు. అందుకే హెల్తీ హోమ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో ప్రీమియం ఫీచర్‌గా మారింది. ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్న ఇళ్లను కొనేందుకు నేటి తరం ఎంతటి ధరనైనా వెచ్చించడానికి వెనకాడటం లేదు.
భవిష్యత్తు మార్కెట్ ఆకుపచ్చనే!
రాబోయే ఐదేళ్లలో గ్రీన్ సర్టిఫికేషన్ లేని ఇళ్లను విక్రయించడం బిల్డర్లకు సవాల్‌గా మారే అవకాశం ఉంది. బ్యాంకులు కూడా గ్రీన్ హోమ్స్ కొనేవారికి వడ్డీ రేట్లలో రాయితీలు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. గ్రీన్ బిల్డింగ్ అనేది ఇప్పుడు ఒక ఛాయిస్ కాదు, అది ఒక అవసరం . రీసేల్ మార్కెట్లో కూడా పాత పద్ధతిలో కట్టిన ఇళ్ల కంటే, అత్యాధునిక ఎనర్జీ ఎఫిషియంట్ ఫీచర్లు ఉన్న ఇళ్లకే ఇన్వెస్టర్లు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.
