భాజపా నేత పురందేశ్వరి ప్రత్యేక హోదా గురించి మళ్ళీ పాత పాటే పాడారు. అదే నోటితో తెదేపా ప్రభుత్వానికి చురకలు కూడా వేశారు. ఆమె చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేక హోదా ఇవ్వడానికి దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించలసి ఉంటుంది. భాజపా పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులని మేము ఒప్పించుకొంటాము. మిగిలిన 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పించుకోగలిగితే ప్రత్యేక హోదా వస్తుంది,” అని అన్నారు.
ఇక తెదేపా ప్రభుత్వం పట్ల తనకున్న వ్యతిరేకతని కూడా ఆమె మళ్ళీ మరోమారు బయటపెట్టుకొన్నారు. “ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వాటిని ఎక్కడెక్కడ, ఎంతెంత ఖర్చు చేసిందో వివరాలు కేంద్రప్రభుత్వానికి ఈయలేదు,” అని అన్నారు.
ప్రత్యేక హోదా దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకారం అవసరమే కానీ దాని కోసం చంద్రబాబు నాయుడే వెళ్లి 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులని ఒప్పించుకోవాలని పురందేశ్వరి చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రజలకి వాగ్దానం చేయలేదు. ఆయనకి ఆ అధికారం లేదు కూడా. కాంగ్రెస్, భాజపాలే ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చాయి. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్న పురందేశ్వరి ప్రస్తుతం భాజపాలో ఉన్నారు కనుక ఆయన కంటే ఆమెకే ఈ విషయంలో ఎక్కువ బాధ్యత ఉంటుంది. కనుక చంద్రబాబు నాయుడుకి ఏమి చేయాలో చెప్పేబదులు పురందేశ్వరి తనే స్వయంగా చొరవ తీసుకొని 13 మంది ముఖ్యమంత్రులని ఒప్పిస్తే బాగుంటుంది కదా. ఆ పని ఆమె చేయకపోయినా ఇటువంటి సలహాలు చెప్పడం పుండు మీద కారం చల్లినట్లే ఉంటుంది. తెదేపా ప్రభుత్వాన్ని ఆమె చాలాసార్లు ఖర్చులకి లెక్కలు చెప్పమని అడిగారు. మళ్ళీ అడుగుతున్నారు. అదేమీ తప్పు కాదు కనుక తెదేపా ప్రభుత్వం లెక్కలు చెపితే బాగుంటుంది.