ఇరాన్ గతంలో యుద్ధం నేరుగా చేసేది కాదు. హుతీలు, హెజ్బొల్లా, హమాస్ తో పాటు ఇంకా చాలా గ్రూపుల్ని సొంత డబ్బులతోపెంచి పోషిస్తూ వాటితో తన టార్గెట్లపై దాడి చేస్తూ ఉండేది. ఏపీ రాజకీయాల్లో జగన్రెడ్డి కూడా అదే చేస్తున్నారు. అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో ప్రాక్సీలను పెంచి పోషిస్తూ వారితో తమ ప్రత్యర్థి పార్టీలపై దాడులు చేయిస్తున్నారు. సందు చూసుకుని మధ్యలో తాను కూడా ఓ రాయి వేసి పోతున్నారు. ఈ ప్రాక్సీల రాజకీయం మితిమీరిపోతోంది. క్షేత్రస్థాయిలో ప్రజల కోసం పోరాడాల్సిన నాయకుడు, ఇలా పక్క రాష్ట్రంలో విశ్రాంతి తీసుకుంటూ ప్రాక్సీ రాజకీయాలు చేయడం ఆయన చేతకాని తనానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
ప్రాక్సీలతో షాడో పాలిటిక్స్
తానూ నేరుగా మాట్లాడితే రివర్స్ ఎటాక్స్ చేస్తారనో.. లేకపోతే వాళ్లకు ఉన్న క్రెడిబులిటీని ఉపయోగించుకోవాలనో ప్రాక్సీలను ఎంచుకున్నారు జగన్. ఏపీ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ప్రకాష్ రాజ్ వంటి వ్యక్తుల నుంచి, కేవలం మేధావి ముసుగులో తన భావజాలాన్ని రుద్దే నాగేశ్వర్ వంటి వారి వరకు అందరినీ జగన్ వాడుకుంటున్నారు. వీరి వెనుక తాను ఉన్నానని చెప్పుకోవడానికి కూడా జగన్ ఇష్టపడరు. ఇలా ఇతరుల భుజాల మీద తుపాకులు పెట్టి కాల్చడం గోబెల్స్ ప్రచారం చేయడమే ఆయన రాజకీయ వ్యూహం.
బాధ్యత లేని నాయకత్వం
వైసీపీ ఓటమి తర్వాత కనీసం పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాధుడు లేడు. జగన్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సోషల్ మీడియాలో కిరాయి వ్యక్తులను, యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా అద్దె మేధావులను పెట్టి అబద్ధాలను ప్రచారం చేయిస్తున్నారు. రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధిపై విషం చిమ్మడానికి ఏపీతో సంబంధం లేని వ్యక్తులను తీసుకురావడం జగన్ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదమే కాకుండా, ఆయన రాజకీయ పతనానికి సంకేతంగా కనిపిస్తోంది. ఇది క్లీన్ పాలిటిక్స్ కాదు.. కేవలం తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న దొంగచాటు రాజకీయం.
ప్రజల్లో పలుచనవుతున్న ఇమేజ్
ఒకప్పుడు నేను ఒక్కడినే వస్తాను.. సింహంలా వస్తాను అని ప్రగల్భాలు పలికిన జగన్, ఇప్పుడు ప్రాక్సీల అండ లేకుండా గడప దాటలేకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రజా సమస్యలపై పోరాడటం అంటే ప్రెస్ మీట్లలో పాత రికార్డులు తిరగేయడం కాదు, కష్టాల్లో ఉన్న ప్రజల మధ్యకు వెళ్లడం. కానీ, జగన్ రెడ్డి మాత్రం తన రాజకీయ వ్యూహకర్తల డైరెక్షన్లో ప్రాక్సీల ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి చేతకాని రాజకీయం వల్ల జగన్పై ఉన్న అరకొర నమ్మకం కూడా ప్రజల్లో పోయి, వైసీపీ మరింత పతనమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
