‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ ప్రారంభమైనప్పటి నుంచి చిత్రబృందం పదేపదే ఒక విషయాన్ని నొక్కి చెబుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన చూసిన తర్వాత ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతారని, ఆయన కెరీర్లోనే ఇది అత్యుత్తమ ప్రదర్శనగా నిలుస్తుందని చెబుతున్నారు. టీజర్లు, ట్రైలర్లు విడుదలైనప్పటి నుంచి కూడా చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇటీవల భోపాల్‌లో జరిగిన ఈవెంట్లో నటుడు రవి కిషన్ ఒక అడుగు ముందుకేసి, “ఈ సినిమాతో రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు రావడం ఖాయం” అంటూ తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చరణ్ చూపించిన నటన, పాత్రలోని ఎమోషన్స్ ప్రేక్షకులను కదిలిస్తాయని అన్నారు.
ఇప్పుడు అదే మాటను మరోసారి బలపరిచారు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. ‘పెద్ది’లో కీలకమైన గౌర్నాయుడు పాత్రలో నటించిన ఆయన, ఈ సినిమా గురించి మాట్లాడిన సందర్భంగా రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. తన అంచనా ప్రకారం ఈ చిత్రంతో చరణ్‌కు నేషనల్ అవార్డు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. పాత్ర కోసం ఆయన చేసిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, తెరపై చూపించిన భావోద్వేగ నటన అసాధారణ స్థాయిలో ఉన్నాయని కొనియాడారు.
చాలా కాలం తర్వాత శివరాజ్ కుమార్ నేరుగా తెలుగు చిత్రంలో నటించడం కూడా పెద్దికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన కథ తనను ఎంతగానో ఆకట్టుకోవడంతోనే ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యానని చెప్పారు. అదే సమయంలో చరణ్ నటన గురించి ప్రస్థావించారు.
ప్రస్తుతం విడుదలైన టీజర్, ట్రైలర్లను పరిశీలిస్తే చరణ్ ఈ పాత్ర కోసం ఎంతగా శ్రమించారో స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో ఆయన పూర్తిగా పాత్రలో లీనమైనట్లు కనిపిస్తున్నారు. శారీరకంగా తన రూపాన్ని మార్చుకోవడమే కాకుండా, పాత్రలోని భావోద్వేగాలను కూడా బలంగా ఆవిష్కరించినట్లు ప్రమోషనల్ కంటెంట్ సూచిస్తోంది.
‘పెద్ది’ని కేవలం మాస్ ఎంటర్టైనర్గా కాకుండా, ప్రేక్షకుల్లో స్ఫూర్తిని నింపే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా చిత్రబృందం అభివర్ణిస్తోంది. గతంలో ‘దంగల్’ వంటి చిత్రాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినట్లే, బలమైన భావోద్వేగాలు, ప్రేరణాత్మక కథాంశాలతో రూపొందిన సినిమాలకు నేషనల్ అవార్డుల స్థాయిలో గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. శివరాజ్ కుమార్ నమ్మకం నిజమై చరణ్‌కు నేషనల్ అవార్డు దక్కితే.. మెగా అభిమానులకు అంతకంటే పెద్ద సంబరం మరొకటి ఉండదు.