నటుడు, నిర్మాత, దర్శకుడు ప్రకాష్ రాజ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా ఆ కామెంట్స్ `ఇరుముగన్` సినిమాపైనే అని తమిళ చిత్రసీమ కోడై కూస్తోంది. విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం `ఇరుముగన్`. తెలుగులో ఇంకొక్కడు పేరుతో విడుదల అవుతోంది. ఈ సినిమాలో విక్రమ్ రెండు పాత్రల్లో నటించాడు. అందులో హిజ్రా పాత్ర ఒకటి. ఈ హిజ్రా పాత్ర గురించే ఇప్పుడు గొడవ మొదలైంది. కథానాయకులు హిజ్రాల పాత్రలు చేయడం ఏమిటని, ఇలాంటి పాత్రలు చేయడం వల్ల వాళ్ల మనోభావాలు దెబ్బతింటాయని విమర్శిస్తున్నాడు ప్రకాష్‌రాజ్. హిజ్రాలు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారని, అయితే… సినిమాల్లో వాళ్ల పాత్రల్ని వక్రీకరించి చూపిస్తున్నారని, విలన్లుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ప్రకాష్‌రాజ్.
విచిత్రం ఏమిటంటే.. ప్రకాష్ రాజ్ కూడా ఒకప్పుడు హిజ్రాగా నటించినవాడే. ‘మహారాణి’ సినిమాలో ప్రకాష్‌రాజ్ హిజ్రా. ఆ విషయాన్ని కూడా ప్రకాష్‌రాజ్ గుర్తు చేశాడు. ”హిజ్రాగా నేనూ నటించా. కానీ అప్పట్లో నాకేం అవగాహన లేదు. ఇప్పుడే మెల్లిమెల్లిగా అన్ని విషయాలూ తెలుసుకొన్నా. ఓ పాత్రని ఎంచుకొనేటప్పుడు విభిన్న కోణాల్లో ఆలోచించడం మొదలెట్టా” అంటున్నాడుప్రకాష్ రాజ్. సడన్‌గా విక్రమ్ సినిమాని ప్రకాష్ రాజ్ ఎందుకు టార్గెట్ చేశాడో ఎవ్వరికీ అర్థంక కాలేదు. మరో విచిత్రం ఏమిటంటే…ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా నటించాడు. దీనిపై ఇరుముగన్ టీమ్ స్పందిస్తుందో లేదో చూడాలి.