కాశ్మీర్ వ్యవహారంలో పాకిస్తాన్ తలదూర్చుతున్నందుకు భారత్ ఏవిధంగా బాధపడుతుందో పాకిస్తాన్ కి అర్ధమయ్యే విధంగా చెప్పడానికే ప్రధాని నరేంద్ర మోడీ పాక్ లోని బలూచిస్తాన్ వేర్పటువాదులకి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలకి మద్దతు ప్రకటించారు. అదేదో నాలుగు గోడల మధ్య చెప్పి సరిబెడితే దానికి అంత తీవ్రత, ప్రాముఖ్యత ఏర్పడేది కాదేమో? కానీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మోడీ ఎర్రకోట మీద నిలబడి పాకిస్తాన్ తో సహా ప్రపంచ దేశాలన్నీ వినేలా గట్టిగా చెప్పారు.
సహజంగానే పాకిస్తాన్ ఆయన మాటలని గట్టిగా ఖండించింది. బలూచిస్తాన్ వ్యవహారం తమ అంతర్గాత వ్యవహారమని అందులో భారత్ చెయ్యి పెట్టడానికి వీలులేదని వాదించింది. పాక్ నోటి నుంచి ఆ మాట రప్పించేందుకే మోడీ బలూచిస్తాన్ ప్రస్తావన చేశారు తప్ప భారత్ కి ఇరుగుపొరుగు దేశాలలో ఇటువంటి సమస్యలు పరిష్కరించే ఆసక్తి, ఓపిక, సమయం లేవనే భావించవచ్చు. కానీ మోడీ సందేశం పాకిస్తాన్ కి బాగానే చేరింది. కనుక అది ఇప్పటికిప్పుడు కాశ్మీర్ వ్యవహారంలో తన పద్దతులు మార్చుకోకపోయినా, రానున్న రోజులలో మార్చుకోక తప్పదు. లేకుంటే బలూచిస్తాన్ వ్యవహారంలో భారత్ కూడా వేలుపెట్టే అవకాశం ఉందని గ్రహించే ఉంటుంది.
ప్రస్తుతానికి మాత్రం పాక్ తన దుర్బుద్ధిని మళ్ళీ మరో చాటుకొంది. డిల్లీలో పాక్ హైకమీషనర్ అబ్దుల్ బాసిత్ కాశ్మీర్ స్వాతంత్ర్యం గురించి మాట్లాడారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శిని ఎస్. జయశంకర్ ని కాశ్మీర్ సమస్యపై చర్చించడానికి రావలసిందిగా ఆహ్వానించింది. ఇస్లామాబాద్ లోని భారత్ హైకమీషనర్ గౌతం బంబవాలేని పాక్ విదేశాంగ కార్యాలయానికి పిలిపించుకొని ఆ ఆహ్వానపత్రం చేతిలో పెట్టారు. ఆ రెండూ భారత్ ని రెచ్చగొట్టే చర్యలే…వాటి వలన ఇరుదేశాల మధ్య సంబంధాలు ఇంకా క్షీణిస్తాయని పాకిస్తాన్ కి కూడా బాగా తెలుసు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ బలూచిస్తాన్ ప్రకటనతో తీవ్ర ఒత్తిడికి గురైన పాక్ ప్రభుత్వం విమర్శల నుంచి తప్పించుకోవడానికే ఈవిధంగా కొంచెం దూకుడుగా వ్యవహరించి ఉండవచ్చు.
పాకిస్తాన్ కి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి తప్పుడు మార్గంలోనే పయనిస్తోంది. నేటికీ ఆ తప్పులని సవరించుకొనే ప్రయత్నం చేయకుండా అదే మార్గంలో ప్రయాణిస్తోంది. సమాజంలో నయీం వంటి అసాంఘిక వ్యక్తులు, శక్తులు ఉన్నట్లుగానే, ప్రపంచదేశాలలో పాకిస్తాన్ కూడా ఒక అతిపెద్ద అసాంఘిక శక్తిగా ఎదుగుతోంది. అటువంటి వ్యక్తులకి, వ్యవస్థలకి ఎప్పుడో ఒకప్పుడు పతనం తప్పదని పాకిస్తాన్ గుర్తిస్తే మంచిది. కానీ దానికి ఆ ఆలోచన లేదు. ఉన్నా పాక్ లో పరిస్థితులు దానిని అందుకు అనుమతించవు.