రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా దేశంలో రెండవ ధనిక రాష్ట్రంగా అవతరిస్తే, ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా చాలా దెబ్బ తింది. అందుకు కారణాలు, సమస్యలు అన్నీ అందరికీ తెలిసినవే. కానీ ఇటువంటి పరిస్థితులలో కూడా ఆంధ్రప్రదేశ్ నిబ్బరంగా ముందుకు సాగుతోంది. అన్ని రకాల రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానని తెదేపా హామీ ఇచ్చిన మాట వాస్తవం. ప్రభుత్వం ఆ హామీని పూర్తిగా నిలబెట్టుకోలేకపోయినా వాటిలో ఎంతో కొంతైన మాఫీ చేస్తోంది. ఆర్ధికసమస్యల కారణంగానే మిగిలిన హామీలని యధాతదంగా అమలుచేయలేకపోయింది. కానీ పూర్తిగా చేతులు ఎత్తేయకుండా తన శక్తిమేర రుణమాఫీ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.
ఇక ఈ రెండేళ్లలో తెదేపా ప్రభుత్వం సాధించిన వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసింది 10,000మంది అధ్యాపకుల నియామకం, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలలో 10,000 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం, రాష్ట్రంలో చిరకాలంగా పెండింగులో ఉన్న చిన్నాపెద్ద సాగునీటి ప్రాజెక్టులని ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేసి పంటలకి నీళ్ళు అందించడం, విద్యుత్ కొరతని అధిగమించి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మలచడం, చాలా అట్టహాసంగా పుష్కరాల నిర్వహణ వంటివన్నీ కనబడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటికి ఎదురీదుతూనే ఈ పనులన్నీ చక్కబెట్టింది. కానీ మిగులు బడ్జెట్ తో, దేశంలో రెండవ ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణాని చేపట్టిన తెరాస ప్రభుత్వం మాత్రం తన హామీల అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ పోలిస్తే వెనుకబడే ఉందని చెప్పక తప్పదు. దళితుల కుటుంబాలకి మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, కేజీ టు పిజి ఉచిత విద్య, లక్ష ఉద్యోగాలు, బారీగా ఉపాధి కల్పనా వంటి అనేక హామీలు ఇంకా అమలుకి నోచుకోలేదు. అందుకు తెరాస ప్రభుత్వం వద్ద అనేక కారణాలు ఉండవచ్చు కానీ ఆ హామీలు అమలుచేయలేకపోయిందని కళ్ళకి కనబడుతోంది.
తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన హామీలని నిలబెట్టుకొంటూ, రాష్ట్రాభివృద్ధి కోసం స్థిరంగా అడుగులు ముందుకు వేస్తుంటే, ధనికరాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ ఈ రెండేళ్లలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ తప్ప మరేపనులు చేయలేకపోయారని తెలంగాణా తెదేపా నేతలు భావిస్తున్నారు. వాటిలో కూడా బారీగా అవినీతి జరిగిందని వాదిస్తున్నారు.
భూసేకరణ విషయంలో కూడా చంద్రబాబు చాలా అవరోధాలు, సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ, రాజధాని కోసం 33,000 ఎకరాలు, పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం వేలాది ఎకరాలు సేకరించుతున్నారు. అందుకు ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి తెదేపా ప్రభుత్వం చాలా విమర్శలు ఎదుర్కొంది కానీ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోలేదు. కానీ ఈ విషయంలో తెలంగాణా ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల నుంచి విమర్శలు, హైకోర్టులో ఎదురుదెబ్బలు కూడా తింది. రెండేళ్ళ పాలన చూసిన తరువాత ఇరువురు ముఖ్యమంత్రుల పనితీరుని బేరీజు వేసుకొని చూసినట్లయితే, కెసిఆర్ కంటే చంద్రబాబు నాయుడే ముందునట్లు కనిపిస్తున్నారు.