తెలంగాణా ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో:190కి హైకోర్టు ఈరోజు ఆమోదం తెలిపింది. సాగునీటి ప్రాజెక్టుల కోసం భూసేకరణ నిమిత్తం తెలంగాణా ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో:123కి సవరణగా ఈ కొత్త జీవోని జారీ చేసింది. దానిలో సూచించిన విధంగా నిర్వాసిత రైతులకి నష్టపరిహారం, పునరావాసం కల్పిస్తూ రైతుల భూములని కొనుగోలు చేయడానికి హైకోర్టు అంగీకరించింది. అంతేకాదు ఇకపై నిర్వాసితులు తప్ప రాజకీయ నాయకులు పిటిషన్లు వేస్తే విచారణకి స్వీకరించమని హైకోర్టు స్పష్టం చేసింది కనుక ఈ తీర్పు ప్రతిపక్షపార్టీల కాళ్లుచేతులు కట్టివేసినట్లయింది. ఇకపై అవి చేసే పోరాటాలని తెరాస ప్రభుత్వం పట్టించుకోనవసరం లేదు. అయితే నిర్వాసితులకి ప్రభుత్వం అన్యాయం చేస్తే సహించబోమని హైకోర్టు గట్టిగా హెచ్చరించింది కనుక భూసేకరణకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కొంచెం ఆచితూచి ముందుకు సాగవలసి ఉంటుంది. లేకుంటే మళ్ళీ రైతులు ఎవరైనా హైకోర్టులో ప్రభుత్వంపై పిరాదు చేస్తూ పిటిషన్ వేసినట్లయితే, మొట్టికాయలు తప్పవు.
ఇంతకాలం మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణకి, జీవో:123కి వ్యతిరేకంగా చాలా తీవ్రంగా పోరాడిన ప్రతిపక్షాలు ఇప్పుడు మరొక అంశం చూసుకోవలసి ఉంటుంది. ఒకవేళ అవి ఇంకా భూసేకరణ చట్టం-2013 అమలు చేయాలని పట్టుబడుతూ ఆందోళనలు చేస్తూ భూసేకరణ కార్యక్రమానికి అడ్డుపడితే అప్పుడు తెరాస ప్రభుత్వమే వాటిపై హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశం కలుగుతుంది. కనుక ప్రతిపక్ష నేతలు కూడా ఇకపై భూసేకరణ వ్యతిరేక పోరాటాలు మొదలుపెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోక తప్పదు. హైకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పుతో తెరాస ప్రభుత్వానికి పూర్తిగా లైన్ క్లియర్ అయినట్లే కనుక సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియని నిరభ్యంతరంగా వేగవంతం చేసుకోవచ్చు.