ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి చాలా మంది భారత దేశ ప్రధానుల్లాగే పాకిస్తాన్‌కి స్నేహ హస్తం ఇవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చాడు మోడీ. అందుకే దేశాన్నే ఆశ్ఛర్యానికి గురిచేస్తూ, సాహసం చేసి మరీ పాకిస్తాన్లో పర్యటించాడు. కానీ పాకిస్తాన్ పాలకులు మాత్రం షరా మామూలుగానే, కుక్క తోక వంకర అన్నట్టుగానే స్పందించారు. కాశ్మీర్ జ్వాలను రగిలించాలని ప్రయత్నం చేశారు. అథమ స్థాయి టెర్రరిస్టులు మాట్లాడే మాటలను మాట్లాడారు.
‘పాకిస్తాన్లో స్కూల్ విద్యార్థులను ఉగ్రవాదులు హతమారిస్తే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించారు. బాధపడ్డారు. భారత్ పార్లమెంట్ కన్నీరు పెట్టింది. ఇండియాలో ఉన్న ప్రతి పాఠశాలా కన్నీరుపెట్టింది. అదీ భారతీయుల మానవత్వం. అదే పాకిస్తాన్లో ఉగ్రవాదులను కీర్తిస్తున్నారు. ఉగ్రవాదుల చేతుల్లో అమాయకులు చనిపోతే అక్కడ ఉత్సవం జరుపుకుంటున్నారు. ఉగ్రవాద స్ఫూర్తితో నిండిన జీవితాలు, ప్రభుత్వాలు వారివి…’ అని మోడీ మాట్లాడారు.
పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు అన్న అర్థం వచ్చేలా మోడీ మాట్లాడారు. ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్‌ని ఏకాకిని చేయాలని, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని శిక్షించాలని భారత్ కోరుకుంటోంది. అందులో తప్పు లేదు కూడా. ప్రపంచ క్షేమం దృష్ట్యా అది జరగాలి కూడా. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు రాజకీయాలు చేయడం పరిపాటి కాబట్టి అంతటి మహత్కార్యం సిద్ధిస్తుందని ఆశించలేం.
అయితే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశానికి అంతకంటే సులభమైన మార్గం ఒకటుంది. పాకిస్తాన్లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న ఆశయం ఉన్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రపంచ దేశాలన్నింటి కంటే కూడా ఉగ్రవాదం వళ్ళ ఎక్కువ నష్టపోతున్నది పాకిస్తానే అని చెప్పడానికి సందేహించక్కర్లేదు. ఉగ్రవాదుల వళ్ళ ఇండియాలో ఎంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందో, అంతకంటే ఎన్నో రెట్టు ఎక్కువగా పాకిస్తాన్లో జరుగుతోంది. పాకిస్తాన్ ప్రజల వాయిస్ బయటకు వినిపించే అవకాశం లేకుండా అక్కడి పాలకులు, ఉగ్రవాదులు కట్టడి చేస్తున్నారు. దేశభక్తి, మతం సెంటిమెంట్ రగిల్చి మౌనంగా ఉండేలా చేయగలుగుతున్నారు. వాళ్ళ వాయిస్ బయటకు వచ్చేలా, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడాలని ఉన్న పాకిస్తానీయులకు ఇండియా సాయం చేసిందంటే అంతకుమించిన విజయం మరోటి ఉండదు.
మన కాశ్మీర్ భూభాగంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, కాశ్మీర్‌ను ఇండియా నుంచి విడగొట్టాలన్న ఆలోచన ఉన్నవాళ్ళను పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందన్న మాట వాస్తవం. పాకిస్తాన్ పాలకులు ఇండియాలో ఉన్న విచ్ఛిన్నకర శక్తులకు సపోర్ట్ చేసే సాహసం చేస్తున్నప్పుడు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద వ్యతిరేక శక్తులకు సాయం చేసే ప్రయత్నం భారతదేశం చేస్తే అది తప్పనిపించుకోదు. అలా జరగాలంటే పాకిస్తాన్ ప్రజలను విమర్శించకూడదు. పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు అన్న అర్థం వచ్చేలా మాట్లాడడం అక్కడ ఉన్న ఉగ్రవాదులకు బలం అవుతుంది. ఓ మతానికి చెందిన ప్రజలు, ఓ దేశానికి ప్రజలు అందరూ కూడా ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తున్నారు అనేలా ఎవరు మాట్లాడినా ఆ మాటలు ఉగ్రవాదులకు ఆయుధాలవుతాయి కానీ వాళ్ళను బలహీనపరచవు. ఏ దేశాన్ని అయితే ఉగ్రవాదులు అడ్డాగా మార్చుకున్నారో, ఏ దేశం నుంచి విజయవంతంగా వాళ్ళ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో అక్కడి ప్రజలలోనే ఉగ్రవాదులను వ్యతిరేకించాలన్న భావన వస్తే అప్పుడు వాళ్ళ బలం తగ్గిపోతుంది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే పాకిస్తాన్ ప్రజల గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే, ఎంత ఎక్కువ చర్చ జరిగితే భారత్‌కు అంత మంచిది. మన రచయితలు, జర్నలిస్టులు కూడా పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ ఉగ్రవాదులే, పాకిస్తాన్ ప్రజలందరూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు అనే అర్థం వచ్చేలా ఆలోచించడం మానేసి, ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే పాకిస్తానీయుల గురించి ఆలోచిస్తే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు బలహీనులవుతారనడంలో సందేహం లేదు.