సినిమా ఇండ్రస్ట్రీలో అంతే మరి. ఓ హిట్టురాగానే ఈగల్లా మూగిపోతారు. ఫ్లాప్ తగలగానే.. పారిపోతారు. ఎన్ని గొప్ప సినిమాలు తీసినా సరే.. ఓ ఫ్లాప్ తేరుకోలేనంత షాక్ ఇస్తుంది. శ్రీనువైట్ల పరిస్థితి అంతే కదా? వరుసగా బ్లాక్ బ్లస్టర్ హిట్లు ఇచ్చాడు శ్రీనువైట్ల. ఆగడుతో సీన్ రివర్స్ అయ్యింది. స్టార్ హీరోలంతా మెల్ల మెల్లగా జారుకొన్నారు. ఇప్పుడు మారుతి పరిస్థితి కూడా అలానే తయారైంది. చిన్న సినిమాలతో పెను సంచలనం సృష్టించాడు మారుతి. లక్షల్లో సినిమా తీసి కోట్లు సంపాదించిపెట్టాడు. భలే భలే మగాడివోయ్.. పెద్ద సినిమాకి ధీటుగా వసూళ్లు సాధించింది. అంతే.. మారుతి హీరో అయిపోయాడు. చిన్న సినిమాలకు దేవుడగా మారాడు. మీ పేరుంటే చాలు బిజినెస్ అయిపోతుంది అంటూ ఆయన వెంట పడినవాళ్లెంత మందో. అలానే వెంకటేష్ సినిమా అవకాశం కూడా జేజిక్కించుకొన్నాడు.
బాబు బంగారం హిట్టయితే.. మారుతి స్టార్ హీరోలతో సినిమాలు చేసేవాడే. కానీ.. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. సరైన కథ లేకపోవడం, దర్శకుడిగా కీలకమైన సన్నివేశాల్లో తేలిపోవడం బాబు బంగారం ప్రధాన లోపాలు. ఈ సినిమా చూసి.. ఇప్పటి వరకూ మారుతితో సినిమాలు చేద్దామని ఎగబడిన నిర్మాతలు మెల్లగా జారుకొంటున్నారని తెలుస్తోంది. బాబు బంగారంకి ముందు 8 మంది దగ్గర అడ్వాన్సులు తీసుకొన్నాడు మారుతి. అందులో యూవీ క్రియేషన్స్, హారిక హాసిని లాంటి సంస్థలున్నాయి. కొంతమంది చిన్న నిర్మాతలూ ఉన్నారు. చిన్నవాళ్ల మాటేమో గానీ.. ఇప్పుడు హారిక హాసిని మాత్రం ‘మారుతితో సినిమా చేయాలా, వద్దా’ అనే డైలామాలో పడినట్టు టాక్. ఈ సినిమా మారుతి చేతుల్లోంచి దాదాపుగా చేజారిపోయినట్టే అంటున్నారంతా. ఒకట్రెండు సినిమాలు జారిపోవడం వల్ల మారుతికి వచ్చే నష్టమేం లేదు. కానీ.. మారుతి బ్రాండ్ కి మాత్రం చెదలు పట్టడం మొదలైందన్న సంకేతం వెలువడడానికి ఇదొక్క కారణం చాలు. ప్రస్తుతం హవీష్ (జీనియస్ ఫేమ్) కోసం ఓ కథ సిద్ధం చేసుకొన్నాడు మారుతి. యువీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. హవీష్ గత సినిమాలు రెండూ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ కూడా మారుతిని భయపెట్టేదే. అయితే ఇప్పుడు మారుతి ఎలాంటి స్టెప్పు తీసుకొంటాడో చూడాలి.