నక్షత్రం… కృష్ణవంశీ తీస్తున్న తాజా చిత్రమిది. పేరు కు తగ్గట్టు ఈ సినిమాని స్టార్లతో నింపేస్తున్నాడు కృష్ణవంశీ. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం కాజల్ కథానాయిక. సుదీప్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతున్నాడు. తనీష్ ప్రతినాయకుడిగా దర్శన మిస్తాడు. ఇంతలో మరో కథానాయిక ఈ టీమ్‌లో వచ్చి చేరింది. తనే.. కంచె భామ ప్రగ్యా జైస్వాల్. ఇందులో ప్రగ్యా ఓ పోలీస్ పాత్రలో కనిపించనున్నదట. తనపై రెండు ఫైట్లు కూడా చిత్రీకరిస్తారట. ఈ సినిమాలో ప్రగ్యా సాయిధరమ్ తేజ్‌కి జోడీగా కనిపించబోతోందని సాయిధరమ్ – ప్రగ్యాల మధ్య ఓ పాట కూడా ఉంటుందని తెలుస్తోంది.
కంచె సినిమాతో మంచి పేరు తెచ్చుకొన్నా.. మొదట్లో ప్రగ్యాకి అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు కాస్త ఆలోచించారు. అయితే ఆమెకు మెల్లమెల్లగా అవకాశాలొస్తున్నాయి. రాఘవేంద్రరావు – నాగార్జున కాంబినేషన్లో రూపొందుతున్న నమో వెంకటేశాయలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది ప్రగ్యా. ఇప్పుడు కృష్ణవంశీ సినిమాలో ఛాన్స్ దక్కింది. చూస్తుండగానే ప్రగ్యా కూడా బిజీ అయిపోనుంది. నక్షత్రంలో ఇంకా చాలామంది హీరోలు, హీరోయిన్లు రాబోతున్నారని… ఇదో మల్టీస్టారర్ సినిమాగా మారబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తానికి ఈ సినిమాలో 5గురు హీరోలు, 5గురు హీరోయిన్లు కనిపించనున్నార్ట. మరి మిగిలినవాళ్ల ఎంట్రీ ఎప్పుడో…??