తెలంగాణ నీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రెజంటేషన్ వెల్లడించింది. ఇందుకోసం డా.దాసోజు శ్రవణ్ బృందం చాలా శ్రమ చేసిందని పిసిసిఅద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారంటే ఫ్రధాన శ్రమ ఆయనదేనని తెలుస్తుంది. మొదట ఉత్తమ్, తర్వాత శ్రవణ్ మాట్లాడారు. ఇది ప్రతిపక్షంగా మంచి ప్రయత్నమని చెప్పకతప్పదు. గతంలో అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ చాలా విమర్శలు మోయవలసి వుంటుంది కాని.. అదే సమయంలో . ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా వారి విమర్శలకు విలువా వుంటుంది. పైగా టిఆర్ఎస్ లోగడ కాంగ్రెస్‌లో విలీనం కావడానికి కూడా సిద్ధమైంది గనక రాజకీయంగా పెద్ద విమర్శించగలిగేది వుండదు. టిఆర్ఎస్ ప్రాజెక్టుల వ్యూహంపై కాంగ్రెస్ ప్రెజంటేషనలో బలమైన నాలుగు అంశాలు కనిపించాయి.
1.ఇప్పటికే పూర్తయిన రంగం సిద్ధమైన ఆయకట్టును తక్కువగా చూపించడం
2. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొద్దిపాటి ఖర్చుతో విస్తారమైన ఫలితాలు ఇచ్చే ప్రాజెక్టుల కొరవ పనులు ప్రాధాన్యతతో పూర్తి చేయకపోవడం
3. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంలో అసంబద్దత
4. అంతులేకుండా పెంచిన నిర్మాణ వ్యయం. వీటితో పాటే అతిశయోక్తులను కూడా కొన్నిటిని బలంగానే చూపించారు.
వాప్కోస్ సంస్థ వైఎస్ రాజశేఖరరెడ్డి బెదిరింపులతో ఆయన చెప్పిన చోట ప్రాజెక్టు కట్టాలని సిపార్సు మార్చడం నిజమైతే మళ్లీ వారికే ఎందుకు ఎలా ఇస్తారని వేసిన ప్రశ్న కూడా ఆలోచించదగింది. మల్లన్నసాగర్పైన కూడా బలమైన విమర్వలే చేశారు. మల్లన్నసాగర్ ఆందోళనపై నిర్బంధం విమర్శల నెదుర్కొన్నది. రాజకీయంగా తమ గురించి చెప్పుకోవడం ఎలాగూ వుంటుంది గాని ప్రభుత్వం ఆ కోణాలపై కేంద్రీకరించేబదులు వాస్తవాలు వివరించడానికి పొరబాట్లు ప్రాధాన్యతలు పున: పరిశీలించుకోవడానికి ప్రయత్నిస్తే ప్రజలు సంతోషిస్తారు. శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పవర్‌పాయింట్ అంతిమమన్నట్టు టిఆర్ఎస్ ఇప్పటి వరకూ ప్రవర్తిస్తున్నది. . కెసిఆర్ ప్రెజంటేషన్ సాంకేతికమైనదైతే ఇది రాజకీయాలు అనుభవాలు కూడా మేళవించింది గనక మరింత వేగంగా జనంలోకి వెళ్లవచ్చు. బహుశా ఈ సమస్యపై తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చ తప్పదని ఈ ప్రెజంటేషన్‌తో స్పష్టమైంది. రెండు రాష్ట్రాల్లోనూ ఏకపక్ష దశ ముగిసిందని గతంలోనే నేను వ్యాఖ్యానించడం వీక్షకులకు తెలుసు.