జలదృశ్యం పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చూపించిన జలదృశ్యంలో అనేక అసత్యాలున్నాయంటూ కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోశారు. తాము చెప్పేది అబద్ధమని రుజువు చేయాలంటూ మీడియా ముఖంగా సవాల్ విసిరారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జలదృశ్యం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చెప్పిన అసత్యాలు ఇవిగో అంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దాదాపు మూడు గంటల పాటు సాగునీటి ప్రాజెక్టులు, రైతు రుణమాఫీ తదితర అంశాలపై తాము చెప్పదలచుకున్నది చెప్పారు.
కోటి ఎకరాలకు సాగునీరు అంటూ కేసీఆర్ చెప్తున్నది పచ్చి అబద్ధమని ఉత్తం ఆరోపించారు. వివిధ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమన్నారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు విషయంలోకేసీఆర్ వైఖరిని మరో నాయకుడు దాసోజు శ్రవణ్ విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులు చివరిదశలో ఉన్నాయని ప్రజంటేషన్ లో వివరించారు. వాటికి చివరి విడత నిధులు విడుదల చేసి ఉంటే ఈపాటికి అవి పూర్తయ్యేవి. రెండు పంటలకు సాగు నీరు అందేదన్నారు. రైతులకు కేసీఆర్ అన్యాయం చేశారని విమర్శించారు.
గోదావరి నీటిని హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు మళ్లించడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. కేసీఆర్ తానే ఆ పథకాన్ని అమలు చేసినట్టు అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిన విషయాల వీడియోను ప్రదర్శించి, ఆ మాటలు ఎలా తప్పో వివరించారు. అడుగడుగునా కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. దీనికి కేసీఆర్ కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి.