ఈరోజుల్లో కమర్షియల్ హిట్‌కి అర్థం మారిపోయింది. డబ్బులొస్తే… సినిమా హిట్టుకిందే జమ వేస్తున్నారు. ఆ లెక్కన మా సినిమా కూడా హిట్టే అంటున్నాడు మారుతి. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘బాబు బంగారం’. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయితే తొలి మూడు రోజుల వసూళ్లూ బాగానే అనిపించాయి. దాంతో ఈ సినిమా హిట్టయిపోయిందన్న భ్రమల్లో ఉన్నాడు మారుతి. అంచనాలు ఎక్కువగా ఉండడం వల్ల.. ఫస్ట్ డే రిజల్ట్ చూసి సినిమా పోయిందని జనం అనుకొన్నారని రెండ్రోజుల అయ్యాక అంతా సర్దుకొందని తన సినిమాకి తానే పోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చుకొన్నాడు మారుతి. ఈ సినిమా వెంకీ ఫ్యాన్స్‌కీ, లేడీస్కీ చేరువ అయ్యిందని ఈ సినిమా కొన్నవాళ్లంతా ఆనందంగా ఉన్నారని `బాబు బంగారం` సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చాడు మారుతి.
తొలి మూడు రోజులూ వసూళ్లు బాగున్న మాట వాస్తవమే. కానీ పక్కథియేటర్లో ఆడుతున్న తిక్క ఫ్లాప్ అవ్వడం పరోక్షంగా బాబు బంగారానికి కలిసొచ్చింది. అంతమాత్రాన పంపిణీదారులంతా సేఫ్ అని కాదు. పెట్టిన పెట్టుబడిలో కనీసం 20 శాతం పోతుంది. ఈ లెక్కలు కూడా మారుతికి తెలుసు. మంగళవారం నుంచి ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. శుక్రవారం విడుదలైన రెండు సినిమాలూ ఫట్టుమంటే.. మరో సినిమా లేకపోవడంతో బాబు బంగారంకి ప్లస్ అవుతుంది. దాని కోసమే మారుతి అండ్ కో కూడా వేయికళ్లతో ఎదురుచూస్తుందేమో?