అవినీతి రక్కసి అందలమెక్కేసింది. అందరి ఆనందం తాలూకూ అంతు చూసే పనిలో పడింది. ఈజీ మనీకి ఆశపడి అవినీతికి పాలు పోసిన అందరకీ కూడా ఇప్పుడు పులిపైన స్వారీకి, అవినీతి సంపాదనకూ తేడా లేదన్న విషయం అర్థమవుతోంది. అలాగని మన యాంటి కరప్షన్ బ్యూరో యాక్టివ్ అయిపోయిందని, రాజకీయ సంకెళ్ళు తెంచుకుని అవినీతి పరుల అంతు చూడడానికి రెడీ అయిపోయిందని భ్రమ పడకండి. రాజీకీయాలను శాసిస్తున్న కొన్ని రాజకీయ కుటుంబాల నుంచి వారసులు వస్తూ ఉన్నంత కాలం అదెప్పటికీ జరగదు.
సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఈ అవినీతి బూతం పేరు చెప్తే ఎలా వణికిపోతారో ఇప్పుడు చిన్న స్థాయి ఉద్యోగుల పరిస్థితి కూడా అలానే తయారవుతోంది. అవినీతి రాక్షసికి ఆహారం అందించలేక, దాని నుంచి దూరం జరగలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పదేళ్ళు డిఫెన్స్‌లో పనిచేశాడు రామకృష్ణ. దేశానికి సేవ చేశాడు. ఆ తర్వాత ప్రజలకు సేవ చేద్దామన్న ఉద్ధేశ్యంతో ఎస్.ఐ.గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ప్రజా సేవకు సంబంధించిన అధికార బాధ్యతలను చాలా ఈజీగానే నిర్వర్తించాడు కానీ అవినీతి రాక్షసిని మేపాలన్న అనఫిషియల్ బాధ్యతలను మాత్రం భరించలేకపోయాడు.
ఒక సిద్ధిపేట డిఎస్పీ శ్రీధర్‌కే నెలకు పదిహేను లక్షల లంచం పంపించాలి. ఇక ప్రస్తుత సిఐ ఆంజనేయులుకు 8 లక్షలు పంపించాలి. పాత సిఐ వెంకటయ్యకు కూడా అదే రేషియోలో టంచనుగా పంపించాలి. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ సయ్యద్, ముత్యం, కానిస్టేబుల్ యాదవరెడ్డికి పంపించాల్సిన మొత్తాల గురించే తన సూసైడ్ నోట్లో ప్రస్తావించాడు రామకృష్ణ. అందరి గురించి రాయాలంటే లెటర్లో స్థలం సరిపోదు కదా. మాజీలు, ప్రస్తుతం డ్యూటీలో ఉన్నవాళ్ళకు రమారమి నెలకు యాభై లక్షలు లంచం సొమ్ము పంపించాల్సిన అనధికార బాధ్యత రామకృష్ణదన్నమాట. ఆ రేంజ్లో ప్రజలను హింసిస్తూ, మనిషిగా చచ్చిపోయి, అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎందుకనో రామకృష్ణ మరీ ఆ స్థాయికి దిగజారలేకపోయాడు. మనుషులకు దూరంగా ఆర్మీలో పనిచేశాడు కదా. అందుకే మనుషులంటే కొంచెం ప్రేమ ఉండి ఉంటుంది. అలాగే మొదటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడైతే మన రాజకీయ నాయకుల వారసులకు మల్లే, అవినీతి డబ్బు ఎలా సంపాదించాలన్న విషయాలన్నీ కూలంకుషంగా తెలిసిఉండేవి. చాలా కాలం ఆర్మీలో పని చేసి ఆ తర్వాత పోలీస్‌గా వచ్చాడు కదా. అలాగే మొదటి నుంచీ కొంచెం కొంచెం పాపం చేసుకుంటూ వచ్చి ఎదిగినవాడు అయితే ఆ పాపభీతి కూడా ఎప్పుడో పోయి ఉండేది. ఒకేసారి ప్రజల కష్టార్జితం యాభై లక్షల రూాపాయలను గుంజాలంటే ………మనిషిగా చచ్చిపోయి అధికారిగా బ్రతకాల్సిందే. ఆ పని చేయలేకపోయాడు రామకృష్ణ. అందుకే సూసైడ్ చేసుకున్నాడు.
ఇప్పుడిక తప్పంతా రామకృష్ణదే. రామకృష్ణకు భార్యలున్నారు, అవినీతి పరుడు అని చాలా చాలా కథలు పుట్టించి ఆయన వ్రాసిన సూసైడ్ లెటర్‌కి విలువ లేకుండా చేయడంలో మనవాళ్ళు వంద శాతం సక్సెస్ అవుతారనడంలో సందేహమే లేదు.
అయితే ఒక విషయం ఆలోచిస్తుంటే మాత్రం అవినీతిపరులను చూస్తుంటే జాలేస్తోంది. ముఖ్య నాయకుడు, ఆయన కొడుకు, ఇంకా కొద్ది మంది ముఖ్యులను పక్కనపెడితే మిగతా వాళ్ళందరికీ కూడా శక్తికి మించిన టార్గెట్స్ ఉన్నాయి. డే అండ్ నైట్ కష్టపడి అవినీతి సొమ్ము సంపాదిస్తూనే ఉండాలి. ఆ రక్కసి బొజ్జను నింపుతూనే ఉండాలి. కొండ దగ్గర రాక్షసి కూర్చుని రోజుకొక గ్రామస్తుడ్ని బలి కోరిన కథలా ఉంది వాస్తవ పరిస్థితి ఆ అవినీతి రాకాసి రాక్షసత్వానికి ఇంకా ఎంతమంది అవినీతి గ్రామస్తులు బలవుతారో చూడాలి మరి. ఇక నుంచి అవినీతి అధికారులను చూసినప్పుడు కూడా కొంచెం జాలి చూపించాలన్నమాట.