ఒక్కరు కాదు.. మంత్రులు తలా కొన్ని ఆహ్వాన పత్రికలు పట్టుకుని హైదరాబాద్ లోని సినీ సెలబ్రిటీలకు ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించి వచ్చారు. సినీ హీరోల, ప్రముఖుల ఇంటింటికీ తిరిగి పుష్కరాలకు ఆహ్వానించి వచ్చారు. అక్కడికీ కొంతమంది ఇదేమి చోద్యం అని విస్తుపోయారు. పుష్కరాలకు ఎవరూ ఎవరినీ ఆహ్వానించరు.. పుష్కర స్నానం ఒక విశ్వాసం. నమ్మకం ఉన్న వారు వస్తారు.. నమ్మని వారితో అనవసరం అని కొంతమంది మొత్తుకున్నారు. అయితే పుష్కరాలను పుష్కరాలుగా కాకుండా.. ప్రచారానికి పనికొచ్చేవిగా చేస్తున్న ప్రభుత్వాలకు ఆ మాటలు తలకెక్కలేదు.
మరి ఇప్పుడు చూస్తే.. ఏపీ ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా వెళ్లి పుష్కరాలకు రారమ్మని అనేక మంది సినిమా వాళ్లను పిలిచి వచ్చినా.. వాటిని పట్టించుకున్న నాథుడు కనిపించడం లేదు. ఇంతవరకూ సినీ సెలబ్రిటీలు ఎవరూ ఏపీ వరకూ వచ్చి పుష్కర స్నానం చేసిన దాఖలాలు కనిపించడం లేదు. టాలీవుడ్ టాప్ హీరోలకు, ఇతర ప్రముఖులందరికీ ఈ ఆహ్వానాలు అందాయి. మీడియాను పిలిచి మరీ వారికి ఆహ్వానాలు అందించి ఫొటోలు తీయించుకున్నారు.. ఏపీ మంత్రులు.
ఆ ఆహ్వానాలు అందుకున్న వారిలో ఎవరూ కూడా విజయవాడ కూ రాకపోవడాన్ని గమనించవచ్చు. మరికొందరు సినీ సెలబ్రిటీలు పుష్కర స్నానాలు చేసినా.. హైదరాబాద్ కు సమీపంలో తెలంగాణలో ఉండే పుష్కర ఘాట్లలో పని పూర్తి చేసుకు వెళ్లారు. ఒకవేళ ఆహ్వానాలు అందించకపోయుంటే.. వస్తే వచ్చారు లేకపోతే లేదు అనుకోవచ్చు.. కానీ, ఆహ్వానాలు అందించడంలో వారు వచ్చారా రారా.. అనేది చర్చనీయాంశంగా మారింది. మరి ఏపీ ప్రభుత్వ ఆహ్వానాలను సినిమా వాళ్లు పట్టించుకోవడం లేదు.. అంటే, హైదరాబాద్ తో సంబంధం లేని చంద్రబాబు ప్రభుత్వంతో టాలీవుడ్ కు పెద్దగా పనిలేకపోయిందని అనుకోవాలా?